Monday, November 14, 2011

తుపాకీ మొనపై వెన్నెల


 
(ఈ ప్రయాణానుభవం ఇంతకుముందు ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో  అచ్చయ్యింది.
ఈ ఫోటో కూడా అందులోదే.)
     క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా  జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయినా మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
     మే ఒకటవ  తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేహ్  వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి వుంది.
 రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్‌ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్‌ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్‌, లే వెళుతూ ఒక్క షాల్‌ సరిపోతుందనుకున్నావా  అంటూ తన దగ్గరున్న ఉలెన్‌ బట్టలన్నీ ఓ సూట్‌కేస్‌ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు సూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
    ఉత్పల ఇచ్చిన అదనపు సట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్‌ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్‌ వెకేషన్‌ కోసం శ్రీనగర్‌ వెళుతున్నారు. శ్రీనగర్‌ ఫ్లయిట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. శ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్‌ ఆఫర్‌ చేసింది. ఆ సీట్లో  కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కప్పబడి, సూర్యకాంతికి మెరుస్తున్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు. ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్పమాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు  పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
     ఎయిర్‌పోర్ట్‌ నించి బయటకు వచ్చి కారులో  కూర్చుని తలుపు వేయబోయను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని. ఎందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్‌ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నారు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47   పట్టుకున్న పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ముందు సీట్లో  సెటిల్‌ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
టూరిస్టులు లేక  అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్‌ చెప్పాడు. హౌస్‌ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజవనులు కూర్చుని వున్నారు. హమీద్‌ ఫ్లోటింగు గార్డెన్‌ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడ్డి లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్‌ జమీన్‌' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్‌ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్‌ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్‌ చినార్‌' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్‌ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.  
    శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఘల్‌ గార్డెన్స్‌ అని పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్‌, నిషాద్‌, హనూర్‌, షాలిమార్‌. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్‌ ఫౌంటెన్‌ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్‌ గార్డెన్స్‌ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్‌ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్‌ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
    మర్నాడు గుల్‌మార్గ్‌ వెళ్ళాలని చాలా తొందరగా తయరైపోయామ్. గుల్‌మార్గ్‌ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్‌ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్‌, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేంచూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్‌ అన్వర్‌ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్‌ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్‌ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
     మా మూడ్స్‌ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్‌ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్‌, దేవదార్‌, పోప్లార్‌ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక్కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద్ద మంచు దిబ్బ  మా కారుకు అడ్డు వచ్చిన్ది. అన్వర్‌ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్‌ చేరిపోయామ్. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్‌ కార్‌) లో టాప్‌ ప్లేస్‌ ఐన సెవెన్‌ స్ప్రిన్గ్స్ చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సవ్మెహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయామ్. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా  కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి,   చీరతోనే తిరిగాను. మైనస్‌ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్‌ నించి తిరుగు ప్రయణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్ననా సహచరుడి ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్‌ పండు రంగులో కొచ్చింది.  'స్నోబైట్‌' ' సన్‌బర్న్‌' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
    మర్నాడు పెహల్‌గావ్‌ వెళ్ళొచ్చని, అనంతనాగ్ లో ఎన్నికలు అయిపోయయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్‌ ప్రకటించాడు.  అమర్‌నాథ్‌ యత్ర పెహల్‌గావ్‌ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్‌ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్‌ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్‌ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్‌  జామ్‌లో ఇరుక్కుపోయామ్. అనంతనాగ్ లో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము  బయలుదేరిందని అన్వర్‌ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయామ్. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్‌ చేరేటప్పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయామ్. అయితే మా ప్రయణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీళ్ళు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్‌ పార్క్‌లో వున్న ట్రాట్‌ ఫిష్‌ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్‌ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్‌ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్‌ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగ్ సరస్సును చూడలేకపోయమన్న నిరాశతో తిరిగి వచ్చేం.
    మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లేహ్' ప్రయాణం మొదలైంది. లేహ్ గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లేహ్ పట్టణం. అది లదాఖ్‌ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని  నేను ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్‌ నుంచి  లేహ్ కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్‌ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్‌ - లేహ్ రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లేహ్ లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెప్పిన్ది. తొమ్మిదిన్నరకి లేహ్ లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగ్ అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుక కొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా  తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్‌ గెస్ట్‌హౌస్‌కి  తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్‌ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్‌ వచ్చి మా ఇద్దరి బ్లెడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్‌ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్‌ తాషి ' ఆప్‌ లోగ్ హమ్‌ సె బీ ఫిట్‌ హై, ఏక్‌ దమ్‌ ఫిట్‌' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లేహ్ చరిత్రతో పాటు, లదాఖ్‌ ఫెస్టివల్స్‌, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్‌ యుద్ధం,  యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్‌ గ్లేసియర్‌ ఫోటోలు, అక్కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్‌ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
    అక్కడినుంచి  మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లేహ్ చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్‌, ఆల్చి, ఫైయండ్‌, షె మొదలైన ఎన్నో  గొంపాలు వున్నాయి. వీటిలో లేహ్ కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్‌ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షణ మైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్‌ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల  చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు.నా సహచరుడేమో "ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగ్ కోట్‌, గ్లౌస్‌ వేసుకుని, మంకీకేప్‌ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను.  వావ్‌! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్‌ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచ్చిన్ది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తండిపోయను. తాషికి థాంక్స్‌ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా  నిద్రపోయాను.
    మే ఎనిమిదో తేదీన  మా అసలు అడ్వంచర్‌ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్‌ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగ్ సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లేహ్ రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది.  ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగ్ సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్‌ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయల మధ్య సన్నటి రోడ్డు మీద కారు మెలికలు తిరుగుతోంది.  ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాలని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి  మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయామ్. అక్కడ మైనస్‌ 4 టెంపరేచర్‌ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని నా సహచరుడు మైనస్‌ డిగ్రీలో నిలబడటం నాకు ఆ స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్‌ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్‌ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను  యెగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్‌ లోపలకు పంపించగలిగాను. తనకు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్‌ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక్కడ ఒక మిలటరీ కేంప్‌ పెట్టారు. ఫస్ట్‌ ఎయిడ్‌, టాయిలెట్‌ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్‌ సుబేదార్‌ విష్ణు బహదూర్‌ గురండ్‌ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి  టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న  టీ ఎంత తృప్తి నిచ్చిన్దో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్‌ ( కొండ ఉడతలు) లు, యాక్స్‌, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగ్ సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది.  ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్‌ గాంగ్ సరస్సు విస్తరించి వుంది. నాలుగు  కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ. సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయామ్. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగ్ సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయణానికి అయిష్టంగానే సిద్ధమయ్యామ్. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప్ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా  తెలుగుమాట వినని మేం  ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్‌ షేక్‌ మహబూబ్‌ పాషా గిద్దలూరుకు, లాన్స్‌ నాయక్‌ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్‌ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యం.

    అప్పటికి మంచుకొండల  మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్‌ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయా. ఆ అదురులోనే మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయా. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్‌ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్‌ ఆన్‌ చేసాడు.  మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయా. ఆక్సిజన్‌ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్‌ ఎక్కి  దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లేహ్ పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిన్ధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం  పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లేహ్ , లదాఖ్‌ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు  మొదలుపెట్టాడు కాబోలు  అనుకున్నాను.
    అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయణమయ్యామ్. క్షణక్షణం మారే లేహ్ వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్‌ పోర్ట్‌లో ఎండ  ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా వివనం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
    పది రోజులపాటు కాశ్మీర్‌ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతనే వుంది. శ్రీనగర్‌ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్‌ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన  80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యరో ఎవరికీ తెలియదని మా పి.ఎస్‌.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు భర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు భర్తలు బతికి వున్నారో లేదో తెలియని భయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని  ఒక చోట చదివాను. 20  వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి  చంపి, చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్‌ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్‌ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరభాగాలు ఇదీ నేటి కాశ్మీర్‌. వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.

Monday, November 7, 2011

నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి - కమలాదాస్

నేను డిగ్రీ పూర్తి చేసి నాకొక ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ
హైదరాబాద్ చేరిన తొలిరోజులు. చదువుకున్నది తెలుగు మాధ్యమంలోనే అయినా మా
హిస్టరీ లెక్చరర్ నాకు ఆంగ్ల సాహిత్యం పట్ల ఎంతో ఇష్టాన్ని, ఆసక్తిని
రేకెత్తించారు. ఆవిడ ప్రేరణతోనే డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ సబ్జక్టుగా
తీసుకున్నాను. టెంత్ క్లాసులో సంస్కృతం, ఇంటర్ లో స్పెషల్ తెలుగు,
డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీషు చదవడం వల్ల సాహిత్యం పట్ల ఎనలేని ప్రేమ
ఏర్పడింది. నా కుటుంబ నేపధ్యం సాహిత్యాను రక్తిని కల్గించేది కాదు. నాకు
నేనుగా సాహిత్యంలో మునగడం, తేలడం నేర్చుకున్నాను. కంటబడిన ప్రతి
పుస్తకాన్ని చదవడం, ఆ పుస్తకం కల్గించే ప్రభావానికి లోనవ్వడం, జీవితానికి
అన్వయించుకోవడం ఓ క్రమపద్ధతిలో జరిగాయి. రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా
నుండి గంగా వరకు చదివి నేను తీవ్రమైన ప్రభావానికి గురయ్యాను. అలాగే
సి.వి.రాసిన “సత్యకామ జాబాలి”. ప్రేమ్ చంద్ “గోదాన్” మహాశ్వేతాదేవి
పుస్తకాలు. ఇలా ఎన్నో వేల పుస్తకాలు జీవితాన్ని సుసంపన్నం చేసాయి.

నేను 1976 లో హైదరాబాదు వచ్చాను. అదే సంవత్సరం కమలాదాస్ ఆత్మకథ “మై
స్టోరి” రిలీజ్ అయ్యింది. ఆ రోజుల్లో నేను కొని చదివిన “మై స్టోరీ”
పుస్తకం ఖరీదు ఆరు రూపాయలు. చిన్న ఫాంట్ లో వుంటుంది. కమలాదాస్ మరణ వార్త
విన్నాక దాన్ని తీసి చదవబోతే ఎర్రగా మారిపోయిన పేజీలు, ఈ వయస్సులో అంత
చిన్న ఫాంట్ చదవడం చాలా కష్టమైంది. పేజీలో పేరుకుపోయిన “డష్ట్ మైట్స్”
విజృంభించి నా మీద దాడి చేసి తుమ్మల మీద తుమ్మలొచ్చి కళ్ళలోంచి బొటాబొటా కమలా దాస్ మరణం కల్గించిన దుఖం వల్ల
నీళ్ళొచ్చాయో, పాతపుస్తకం ముట్టుకోవడం వల్ల వచ్చాయో నేను నిర్ణయించుకోలేక
పోయాను. ఎందుకంటే కమలాదాస్ భౌతికంగా వేల మైళ్ళ దూరంలో వున్న తన రచనల
ద్వారా, జీవన విధానం ద్వారా నా మీద విపరీతమైన ప్రభావం వేసిన రచయిత్రి.
సంచలనాలకు పెట్టింది పేరైన కమలాదాస్ పనిగట్టుకొని సంచలనాలను
సృష్టించలేదు. తను నమ్మిన దాన్ని ఆచరించడాన్ని జనం సంచలనాలుగా పిలవడం
జరిగింది. ఆమె ఏం మాట్లాడినా, రాసినా, ఆచరించినా తను నూటికి నూరు శాతం
నమ్ముతూ చేసిందే. ఎవరైనా కొత్త సంచలనం ఏం సృష్టించబోతున్నారని అడిగితే,
“నేను నమ్మిన దాన్ని మాట్లాడుతున్నాను. వివాదాస్పదంగా బతకడం నా కేమీ సరదా
కాదే. జనం ఎందుకలా అనుకుంటారు?” అంటూ ప్రశ్నించేది కమలాదాస్.

కమలాదాస్, నిజానికి మరణ శయ్య మీద హాస్పిటల్ లో ఉండి, హాస్పిటల్ బిల్లులు
చెల్లించడానికి “మై స్టోరీ” రాసింది. నేను ఈ లోకంలోంచి నిష్క్రమించే
ముందు, ఆ సమయం ఆసన్నమయ్యేసరికి నాలో ఉన్న అన్ని రహస్యాలను నాలోంచి బయటకు
పంపెయ్యాలనుకున్నాను. అందుకే ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. అయితే
అనూహ్యంగా నేనుకోలుకున్నాను. నా కుటుంబం గురించి బంధువుల గురించి నేను
రాసిన అంశాలు వాళ్ళల్లో తీవ్రమైన కోపాన్ని కల్గించాయి. చట్టబద్ధంగా ఒక
వ్యక్తిని వివాహమాడి అతనితో వుంటూనే నేను వివాహం బయట వ్యక్తులతో ప్రేమలో
పడ్డానని రాయడం పెను వివాదానికి దారి తీసింది. నేను నా స్వంత ఊరు
వెళ్ళినపుడు ఆ కోపాల మంట నన్ను తాకింది. నేను బొంబాయి పారిపోవలసి
వచ్చింది.” అంటుంది “మైస్టోరీ” కి రాసిన ముందు మాటలో.

1932 లో మలబార్ తీరంలో సంప్రదాయ నాయర్ల కుటుంబంలో పుట్టింది. తండ్రి
వి.యం.నాయక్ “మాతృభూమి” అనే మళయాల పత్రికకు మానేజింగ్ ఎడిటర్ గా
పనిచేసేవాడు. తల్లి బాలామణి అమ్మ కవయిత్రి. తల్లి తండ్రులిద్దరూ తమ
వ్యాపకాల్లో మునిగి తేలుతుండడం వల్ల కమలాదాస్ బాల్యం ఒంటరితనంలోనే
గడిచింది. అయితే తల్లి, మేన మామ నారాయణ మీనన్ లు రచయితలుగా
ప్రసిద్ధులవ్వడం వల్ల ఇంటి నిండా సాహిత్య వాతావరణం వుండేది. చిన్నప్పటి
నుండే కవిత్వం చదవడం అలవాటైంది కమలకు. తనూ కవితలల్లడం అలవరుచుకోవడంతో
పాటు తన దైన ఊహల్లో విహరిస్తూండేది. బాల్యంలో ఎదుర్కొన్న ఒంటరితనానికి
తోడు స్కూల్ వాతావరణం, అక్కడి యాంత్రికత ఆమెను తీవ్రమైన నిరాశను
మిగిల్చాయి. అందుకే ఆమెకు ఆరేళ్ళ వయసప్పుడు రాసిన కవిత్వంలో ఎంతో
విషాదముండేది.

“నేను ఆరేళ్ల వయసప్పుడే చాలా సెంటిమెంటల్ గా ఉండేదాన్ని. విషాదభరితమైన
కవితలు రాసేదాన్ని. తలలు తెగిపోయి, ఎప్పటికీ తలలేకుండా వుండే బొమ్మల
గురించి కవితలు రాసేదాన్ని. అలాంటి ప్రతి కవిత నన్ను ఏడిపించేది” అంటుంది
తన ఆత్మకథలో.

అలాంటి ఒంటరితనపు, విషాదపు బాల్యం గడవక ముందే 15 సంవత్సరాలకే తన కంటే
చాలా పెద్దవాడయిన మాధవ దాస్ తో పెళ్ళి జరగడం ఆమెను మరింత నైరాశ్యంలోకి
తోసేసింది. మాధవ్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక తొలిసారి ఆమెని కలవడానికి
కలకత్తా వొచ్చినప్పుడు అతని ప్రవర్తన ఆమెను తీవ్రంగా గాయపరచడతో పాటు అతని
పట్ల విముఖతను ప్రోదచేసింది. అతని మొరటుతనం ఆమెను భయపెట్టింది. తన
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని భావించిన ఆమె అతన్ని వెకిలి చేష్టలని
అసహ్యించుకుంది.”

“అతను నన్ను సున్నితంగా తన చేతుల్లోకి తీసుకోవాలని, నా చెవుల్లో ప్రేమ
భాష్యాలు చెప్పాలని ఆశించాను. నాతో ప్రేమగా సంభాషించాలని, స్నేహం
కురిపించాలని, వెచ్చటి స్పర్శని పంచాలని కోరుకున్నాను. తన చేతులతో నా
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని నేను గాఢంగా ఆశించాను.”

అలా జరగక పోగా ఆమె ఒంటరిగా వున్నప్పుడు అతని మొరటు శృంగార చేష్టలు ఆమె
సున్నితమైన శరీరం మీద నల్లటి, ఎర్రటి మచ్చల్ని మిగిల్చాయి. వివాహం జరిగాక
తన తొలి రాత్రి అనుభవాన్ని ఇలా వర్ణిస్తుంది.

“తొలి రాత్రి ఎలాంటి హెచ్చరికా లేకుండా అతను నా మీద పడ్డాడు. అతన్నుంచి
తప్పించుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. నా గుండె వేగంగా
కొట్టుకోవడంతో నన్ను వదలమని ఎంతో బతిమాలాను. వినలేదు. ఆ రాత్రి అతని
అత్యాచార పర్వం అసంపూర్తిగానే మిగిలింది. ఆ రాత్రి పదే పదే అతను నన్ను
గాయపరుస్తూనే వున్నాడు.”

కమలాదాస్ “మారిటల్ రేప్” గురించి, తన తొలిరాత్రి అనుభవం గురించి వివరంగా
తన ఆత్మకథలో “wedding night:” అనే చాప్టర్ లో ఎంతో ధైర్యంగా రాసింది.

పెళ్ళి, భర్త లాంటి ఆలోచనలు కలగని వయస్సులోనే పెళ్ళవడం, వివాహ జీవితంలో
కుదురుకోక ముందే 16 ఏళ్ళకే తల్లవడం జరిగిపోయాయి. కమలాదాస్ పెద్దకొడుకు
నల్లప్పన్ ఆమెకు పదహారేళ్ళకే పుట్టాడు. వెంట వెంటనే ఇద్దరు కొడుకులు
పుట్టడంతో చిన్నారి కమల చిన్నపిల్లలాగే తన కొడుకులతో కలిసి ఆడేది,
పాడేది. పెద్దకొడుకు పుట్టాక, ఆమె భర్త కనపరిచిన విసుగు, నిర్లక్ష్యం
ఆమెను ఎంతో బాధపెట్టేవి. అతనికి సెక్స్ తప్ప ఇంకేది పట్టేది కాదు. ఫక్తు
వ్యాపారి లాగా ప్రవర్తించేవాడని రాస్తుంది ఒకచోట. తను ఊహించుకున్న
జీవితానికి, వాస్తవంతో తను బతుకుతున్న జీవితానికి ఎక్కడా పొంతన కుదరక
తీవ్రమనస్తాపం పొందేది. ఈ సంఘర్షణంతో ఆమె కవిత్వంలో పొంగిపొర్లేది.
సమ్మర్ ఇన్ కలకత్తా, ది దిసెండెంట్స్ కవితా సంపుటిల్లో తన మానసిక
కల్లోలాన్ని, కలవరాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే భర్త నిర్లక్షాన్ని,
తిరుగుబోతు తనాన్ని ధిక్కరిస్తూ, తాను కూడా అతని లాగానే విశ్వాస
రాహిత్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటుంది.

I made up my mind to be unfaithful to him, at least physically.” ఒక
భవన నిర్మాణ కార్మికుడితో ప్రేమకలాపాలు సాగించడానికి ఎలా ప్రయత్నించింది
ఎంతో వివరంగా, ధైర్యంగా “మైస్టోరీ”లో రాస్తుంది.

ఈ సాహసం, తిరుగుబాటు తత్వం బతుకు పొడుగునా కలుపుకోవడం కమలాదాస్
ప్రత్యేకత. సంసార జీవితం లోని మొనాటనీని అత్త, భర్తల సాధింపులను
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి సైతం సిద్ధపడుతుంది. అక్కడ కూడా
విఫలమై రాజీ పడుతుంది. భర్తకు చాకిరీ చెయ్యడం అతని చొక్కాలకు బటన్లు
కుట్టడం, వొళ్ళు నలిగేదాకే చాకిరీ చేయడం అలవాటు చేసుకున్నా ఆమెలోపలి ఆత్మ
అనుక్షణం ఆమెను ధిక్కరించేవి. తను కలలు కన్న జీవితానికి, తాను బతుకుతున్న
జీవితానికి ఎక్కడా పొంతన కుదరక మానసిక సంఘర్షణని అనుభవిస్తూ, ఆ సంఘర్షణని
కవితలుగా మలచడం అలవాటు చేసుకుంది.

ఒక రోజు కమలాదాస్ భర్త మాధవ్, తన పురుష ప్రేమికుడుతో కలిసి తమ పడకగది
తలుపులు బిగించుకున్నపుడు, (అదీ తన పుట్టిన రోజు నాడు) కమల భరించలేక
భోరున ఏడ్చింది. తన భర్త ప్రేమ తనది కాదని అర్ధమై అర్ధరాత్రిళ్ళు ఒంటరిగా
దుఃఖంతో సతమతమయ్యేది. అలాంటి ఓ రాత్రి, కొత్త జీవితాన్ని, కొత్త
భవిష్యత్తునూ ఆశిస్తూ
“wipeout the paints, unmould the clay,
Let nothing remain of that yesterday”

అంటూ రాసిన కవితని అప్పటికప్పుడు పత్రికకు పంపించింది. ఇంట్లో పనంతా
అయ్యాక, అందరూ తిని నిద్రపొయ్యాక, అర్ధరాత్రి వేళ డైనింగ్ టేబుల్ ని
శుభ్రం చేసుకొని అక్కడే రాయడానికి కూర్చునేది. గంటలు అలా గడిచిపోతుండేవి.
ఒక్కోసారి తెల్లారి పోయేది. రాత్రంతామేలుకొని రాస్తూ వుండడం, పగలు మళ్ళీ
కుటుంబ బాధ్యతలు వీటన్నింటితో ఆమే ఆరోగ్యం పాడవడం మొదలైంది.రచయిత్రి
కావాలనుకునే స్త్రీకి ఈనాటికీ తనకంటూ ఓగది, ఓ టేబుల్, కుర్చీ, సరిపడిన
సమయం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కమలాదాస్ ఇలా అంటుంది.

“నేను మామూలు మధ్యతరగతి స్త్రీ గురించి ముఖ్యంగా ఎవరైతే రచయిత
కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నా విషయానికొస్తే
వంటింట్లో కూరగాయలు తరుక్కునే బల్ల, భోజనాలు తినే బల్ల ఇవే నా రచనా
స్థలాలు. అదంతా శుభ్రం చేసుకుని రాసుకోవడానికి కూర్చోవాలి. అదే నేను
పనిచేసుకునే స్థలం. అందరూ నిద్రపోయాక నేనూ, నా టైప్ రైటర్ మాత్రమే
మేలుకొని వుంటాం. అలాంటి సమయంలోనే నేను నా కుటుంబాన్ని పూర్తిగా
మర్చిపోయి స్వతంత్ర వ్యక్తిగా మిగులుతాను. ఆ నిశ్శబ్ద నిశిరాత్రి నన్ను
నేను కనుగొంటాను.” అంటుంది. 1921 లో వర్జీనియా వుల్ఫ్ “ఏ రూమ్ ఆఫ్ ఒన్స్
ఒన్” లో “ప్రతి స్త్రీ తనకంటూ ఓ గది, తనదంటూ కొంత సొమ్ము తప్పకుండా
కలిగి ఉండాలి. రచయిత్రి కావాలనుకునే స్త్రీలకి ఇవి ఖచ్చితంగా వుండాలి”
అంటుంది. కమలాదాస్ లాంటి ప్రసిద్ధ రచయిత్రులు కూడా డైనింగ్ టేబుల్ మీదే
తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం నిజంగా విషాదమే కదా!

కమలాదాస్ కథలు, నవలలు రాసినప్పటికీ ఆమె రాసిన కవిత్వం బహుళ ప్రజాదరణ
పొందింది. తనలో చెలరేగే సంఘర్షణలను, భావోద్వేగాలను, కల్లోలాలను
వ్యక్తీకరించడానికి కథ, నవల కన్న కవిత్వానికే ఎక్కువగా ఎంచుకున్నది. ఆమె
భావాల తీవ్రత, స్వేచ్చా కాంక్ష కవిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతుంది.
“పునీల్” అనే కవితలో

నిజం,
ఒకటి రెండు కట్టుబాట్లని నేను మీరాను
అయినప్పటికీ దైవాన్ని కాని, సమాజాన్ని కాని క్షమాభిక్ష కోసం అర్ధించను.
అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను
నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను.
పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు
పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!”

( - అనువాదం పసుపులేటి గీత)

“నాలో సుడులు తిరిగే బాధే కవితలుగ రూపెత్తాయ్. ప్రతి కవిత బాధలోంచే
పుట్టింది.” అంటుంది ఒకచోట. ఒంటరితనం, భార్యాభర్తల సంబంధంలోని బోలుతనం,
యాంత్రికత,ప్రేమ రాహిత్యం కమలాదాస్ ని నిరంతర అన్వేషణలోకి నడిపాయి.
సంతోషం కోసం, నిజమైన ప్రేమ కోసం ఈ అన్వేషణ కొనసాగింది. సూటి బాణాల్లాంటి
కవితల్లో తన భావోద్వేగాలను వ్యక్తీకరించడం, జనాలను షాక్ చెయ్యడం ఆమెకు
వెన్నతో పెట్టిన విద్య.

“స్టాక్ వెరిఫికేషన్” అనే కవితలో ………….

మునుల తాళపత్ర గ్రంధాలు, సాధువుల ప్రవచనాలు నన్ను శాంత పరిచే వేదాంతాలు,
ఏవీ నా మీద రుద్దకండి కాళ్ళ మధ్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు
కొడుకుల్ని బయటకు తెచ్చాను” అని రాయగలిగిన సత్తా కమలాదాస్ లో మాత్రమే
చూడగలం.

కమలాదాస్ కవిత్వం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వేళ, ఆమె భర్తకి కవిత్వ
రచన లాభసాటి వ్యాపారంగా కనబడలేదు. రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసే మాధవ్
దాస్ ఇంటా బయటా ఎప్పుడూ డబ్బులెక్కల్లోనే మునిగి తేలుతుండడం, ఆమె ఏం
రాస్తే డబ్బులు రాలతాయో ఆలోచించడం, ఆమెను కవిత్వం రాయడం మానేసి కథలు
రాయమని నిర్దేశించడంతో కమల నవలలూ, కాలమ్స్ రాయడం మొదలుపెట్టింది.” అతను
చెప్పిన దాన్ని నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. దీనివల్ల నాలో కవిత్వం ఎండి
పోయింది కానీ మా దాంపత్యం మాత్రం విజయవంతంగా నడిచింది.” అంటుంది.
అందులోని వ్యంగ్యాన్ని, పదునును అర్ధం చేసుకుంటే తప్ప కమలాదాస్ వేదనని
అర్ధం చేసుకోలేం.

కమలాదాస్ మళయాళ సాహిత్యాన్ని “మాధవకుట్టి “,ఆంగ్ల సాహిత్యాన్ని” కమలాదాస్
“పేరుతోను రాసేది. ఆమె రాసిన ఆంగ్ల రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
ప్రాచుర్యం పొందాయి. నోబుల్ సాహిత్య పురస్కారానికి కూడా! కమలాదాస్
ఆంగ్లంలో అయిదు కవితాసంపుటులు ఒక నవల ” అల్ఫాబెట్ ఆఫ్ లష్ట్” “పద్మావతి
ది హర్లెట్ అండ్ అదర్ స్టోరీస్” పేరుతో కథల సంపుటి, “మైస్టొరీ” ఆత్మకథ
ప్రచురించింది.

కమలాదాస్ కథల నిండా కలకత్తాలో ఆమె బాల్యం తాలూకు అమాయికత్వం, జ్ఞాపకాలు
నిండి వుంటాయి. ఆమె కవిత్వం ఎలాంటి దాపరికాలు లేకుండా, కుండ బద్దలు
కొట్టినట్టు వుంటుంది. “ఇల్లాలినంటూ నాకో పేరుపెట్టావ్/ నీకు టీ
కాచడానికి పటిక బెల్లం దంచడం/ వేళ తప్పకుండా విటమిన్ గోలీలివ్వడం/ ఇదీ
నేను నేర్చుకున్న చదువంతా” కమలాదాస్ ఇంటి చాకిరీ, భర్తకి సేవలు చేయడం
గురించి ఇంత సూటిగా రాయడం ఇపుడూ పెద్ద గొప్పగా, కొత్తగా అన్పించకపోవచ్చు.
80 దశకంలో తెలుగు సాహిత్యంలోకి స్త్రీవాద ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి వొచ్చి
చేరినపుడు తెలుగు కవయిత్రులు ఇంతకంటే సూటిగ, ఘాటుగా కవిత్వం రాసారు. కానీ
కమలాదాస్ రాసిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎంత విప్లవాత్మకంగా,
స్త్రీవాద దృష్టి కోణంతో రాసిందో అర్ధం చేసుకోవచ్చు. సహజంగానే ఆమె రచనలు
సంప్రదాయ వాదాల్లో గగ్గోలు పుట్టించాయి. 1976 లో ఆమె ప్రచురించిన
“మైస్టోరీ” జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గొప్ప కీర్తిని
సంపాదించిపెట్టినా అంతే స్థాయిలో ఆమె మీద విమర్శల జడివాన కూడా కురిసింది.
అందులో ఆమె వర్ణించిన అనుభవాలు, వివాహేతర సంబంధాల వర్ణనలు, ఆడస్నేహితులతో
ఎదురైన అనుభవాలు భర్త కొనసాగించిన హోమోసెక్సువల్ సంబంధాలు -
వీటిన్నింటిని నదురు బెదురు లేకుండా తన ఆత్మకథలో రాసిన కమలాదాస్
సంప్రదయవాదులతో పాటు బంధువుల ఆగ్రహానికి కూడా గురైంది. లెస్బియన్ రిలేషన్
షిప్ గురించి ఆమె రాసిన అంశాలు చాలా మందిని షాక్ చేసాయి. 18 సంవత్సరాల
అమ్మాయి తన పట్ల వ్యవహరించిన విధాన్ని

“ఆమె నా పెదాల మీద ముద్దు పెట్టింది. నా చెవుల్లొ నువ్వు చాలా స్వీట్ గా
వున్నావ్ అంటూ గుసగుసలాడింది. నా జీవితంలో నేననుభవించిన మొదటి ముద్దు
ఇదే. మా అమ్మ నేను పసిదానిగా వున్నపుడు ముద్దు పెట్టిందేమో గాని ఆ తర్వాత
ఎవ్వరూ నాకు ముద్దివ్వలేదు” అంటుంది.

కమలాదాస్ రాసిన విషయాలు ఆనాటి మళయాళీ సమాజాన్ని ఓ కుదుపు కుదిపాయి.
నిర్భయంగా ఆమె వెల్లడించిన అంశాలను చూసి గగ్గోలు పెట్టే సమాజాన్ని మరింత
ఏడిపించాలనే అల్లరి ఆలోచనలు కూడా ఆమె చేసిందా అన్పించేలా ఆమె ఆత్మకథలో
ఒక్కో చాప్టర్ కి ఆమె పెట్టిన శీర్షికలు వున్నాయి. బహుశా ఆమె ఆత్మకథను
సీరియలైజ్ చేసిన పత్రిక కూడా రెచ్చగొట్టే విధంగ శీర్షికలు పెట్టినట్టు
అన్పిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో అవన్నీ ఉత్తుత్తి సంఘటనలే అని
ప్రకటించింది కూడా!

కమలాదాస్ తన జీవితమంతా ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం
అన్వేషించింది. “ప్రేమతోను, నమ్మకంతోను నిండీన సంబంధాలను స్త్రీ పురుషులు
ఇద్దరూ కోరుకుంటారని, అని ఇంట్లో దొరకనప్పుడు బయట వెతుక్కుంటారని” ఒక
ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. వివాహం బయటి ప్రేమ ను వెదుక్కొవడం అనే
ఆలోచననే సహించని సంప్రదాయ సమాజం, ఆమె భావాలను విని వొదిలేస్తుందని
భావించడం వెర్రితనమే అవుతుంది. అందుకే మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి
అక్షరం వివాదాస్పదమైంది. ఆమె మనస్ఫూర్తిగ నమ్మిన దాన్ని చెప్పింది తప్ప
సెన్షేషన్ కోసమో, వివాదం కోసమో చెప్పలేదు. ఆమె దృష్టీలో శారీరక, మానసిక
సౌందర్యాల మధ్యన భేదం లేదు. శరీర సౌందర్యాన్ని వర్గించడంలో ఆమె ఎలాంటి
శషబిషలు పాటీంచలేదు. “డాన్స్ ఆఫ్ యూనక్స్”, “యాన్ ఇంట్రడక్షన్” లాంటి
కవితల్లో దీనిని మనం చూడొచ్చు. “యాన్ ఇంట్రడక్షన్” కవితలో

“I am every/ woman who love” అంటుంది. 70 దశకంలో కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ప్రతినిధిగా కమలాదాస్ “వ్యక్తిగతంగా సమాజం భావించే అన్ని
అంశాల మీద రాస్తూ, ఆయా అంశాలను బహిరంగపరచడానికి ఎలాంటి సంకోచం లేకుండా
రాస్తూ పోయింది. అప్పటికే ఇస్మత్ చుంగ్తాయ్ రాసిన “రిహాయి”కథ సంప్రదాయ
సాహిత్యలోకంలో పెను సంచలనాలను కలిగించింది. కమలాదాస్ తన అనుభవాలుగా
అంగీకరిస్తూ, శరీరం గురించి, కోరికల గురించి, ప్రేమ గురించి, మానవీయ
స్త్రీ పురుష సంబంధాల గురించి ధైర్యంగా రాయడం ద్వారా కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ఎంతో స్ఫూర్తిని, నిబ్బరాన్ని ఇచ్చింది. ఎనభై దశకంలో
వెల్లువెత్తిన స్త్రీవాద సాహిత్యానికి, స్త్రీ వాద కవయిత్రులకు
స్ఫూర్తిగానూ కమలాదాస్ రచనలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

కమలాదాస్ ఏది రాసినా సంచలనమే. ఏది ఆచరించినా సంచలనమే. డిశంబరు 16, 1999
సంవత్సరంలో 65 ఏళ్ళ వయస్సులొ ఇస్లామ్ మతాన్ని స్వీకరించింది. ఆమె రచనలు
ఎంత సంచలనం కల్గించాయో ఆమె ఇస్లామ్ మత స్వీకరణ కూడా వేడి వేడి చర్చల్ని
లేవనెత్తింది. అంతే కాదు బురఖా ధరిస్తూ, స్త్రీలను అణిచివేసే హిందూ మతంలో
కన్నా ఇస్లామ్ లోనే స్త్రీలకు రక్షణ వుందనే ప్రకటన కూడా చేసింది.
సహజంగానే ఇలాంటి ప్రకటనలు జనంలో ఆమె పట్ల ఆగ్రహాన్ని వెల్లుబికిస్తాయి.
అయితే కమలాదాస్ తాను నమ్మిన దాన్ని ఆచరించడానికి, రాయడానికి, బహిరంగంగా
ప్రకటించడానికి ఏనాడు జంక లేదు. ఒక సంప్రదాయ హిందూ నాయర్ కుటుంబానికి
చెందిన కమలాదాస్, భర్త మరణానంతరం ఇస్లాం స్వీకరించి, పేరు మార్చుకుని
తుదివరకు అలాగే బతికింది.

కమలాదాస్ రాజకీయాలను కూడా వొంటబట్టించుకుని “లోక్ సేవా పార్టీ” ని
స్థాపించి 1984 పార్లమెంటు అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయింది.

తనని తాను ఫెమినిష్ట్ గా చెప్పుకోక పోయినా, తన జీవితంలోని అనుభవానలను,
తాను నమ్మిన వాటిని గురించి రాస్తూ స్త్రీల జీవితాల్లోని అణిచి వేత
గురించి రాసింది. తన గురించి రాసుకున్నా, వారెవ్వరి గురించి రాసినా ఆమె
ఎక్కడా ఏ ముసుగులూ వేసుకోలేదు. జీవితమంతా ప్రేమకోసం వెదుకులాటే అయ్యింది
ఆమెకి. “నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. ప్రేమకోసం వెదుకులాటే నా జీవితమంతా”
అంటుంది ఒకచోట.

కమలాదాస్ తన రచనల ద్వారా ఇంగ్లీషు, మళయాళ సాహిత్యాల్లో అజరామరంగా
నిలిచిపోతుంది. నిరంతర అన్వేషిగా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆ
ప్రయోగాల పర్యవసానంగా ప్రజల ఆగ్రహాలను చవి చూసింది. తన అన్వేషణలో భాగంగా
పెయింటింగ్స్ వేసింది. రాజకీయాల్లోకి నడిచింది. మతం మార్చుకుంది. నిరంతర
అన్వేషణలో భాగమే ఇవన్నీ కూడా. ప్రేమతో నిండిన స్త్రీ పురుష సంబంధాల కోసం
జీవితమంతా అన్వేషించింది. మనుష్యుల మధ్య మానవీయ సంబంధాల కోసం ఆరాటపడింది.

2006 లో కమలాదాస్ చిట్టచివరి సారి కేరళను సందర్శించింది. తన తాతల నాటి
ఇంటిని, స్థలాన్ని కేరళ సాహిత్య అకాడమీకి దానం చేసింది. తను బతికుండగా
మళ్ళీ కేరళకు రాలేననే విషయం ఆమెకు అర్ధమైనట్టే వుంది. అందుకే ఇలా
అంటుంది.

“నేను మళ్ళీ నా మరణం తర్వాత ఇక్కడికి వస్తాను. మానవాకృతిలో మాత్రం కాదు.
ఒక పక్షిగానో, ఒక లేడిగానో మాత్రమే వస్తాను. నేను ఈ భూభాగంలో మమేకమై
వుంటాను.”

కమలాదాస్ తుది శ్వాస విడిచింది పూనాలో తన రెండో కొడుకు ఇంట్లో. 75
సంవత్సరాల తన అన్వేషణకు ఫుల్ స్టాప్ పెడుతూ 31 మే కమలాదాస్ మరణించింది.
చనిపోయేందుకు రెండు సంవత్సరాల ముందు తనను దర్శించవచ్చిన మిత్రుడు విజయ్
నంబీశన్ తో నేను ముసలి దాన్ని అయిపోతున్నాను” అంటుంది. 72 ఏళ్ళ వయస్సులో
తను ముసలితనంలోకి వెళ్ళినట్టు కొత్తగా చెప్పడం, గమనించడం అంటే తనలోని
పసిప్రాయం లేకుండా పోయిందని అంగీకరించడమే. అలాంటి చిన్నపిల్లలతత్వం ఆమెలో
తుదిదాక బతికుండడమే ఆమెలో గొప్పతనం.

నిరంతరాన్వేషి,, సంచలనాల చిరునామా, ప్రేమ పిపాసి, సాహసి కమలాదాస్ కు ఇదే
నా అక్షరాంజలి. తన ఆత్మకథ ద్వారా నా మీద ఎంతో ప్రభావం చూపిన కమలకు నా
అశ్రు నివాళి

Saturday, November 5, 2011

విందు తర్వాత…..


చలి గడగడలాడించేస్తోంది. చేతి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. గది మధ్యలోని బుఖారి నుంచి వచ్చే వెచ్చదనం ఏ మాత్రం సరిపోవటం లేదు.
”అబ్బ! ఇంత చలేమిట్రా బాబూ! ఎలా భరిస్తున్నావ్‌” వధవి అతి కష్టం మీద అంది. చలికి పళ్ళు టక టక కొట్టుకుంటున్నాయి.
”ఏం చేయమంటావ్‌ భరించక. అయినా నిన్ను చలికాలంలో కాశ్మీర్‌ రమ్మని ఎవడు చెప్పాడు” అని హనీఫ్‌ ”కాంద్దీ లావో” అన్నాడు.
”నాకేం తెలుసురా బాబూ! మరీ ఇంత భయంకరంగా వుంటుందంటే ఢిల్లీ నుంచే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని” సుధాకర్‌ మాట్లాడకుండా సవెవాయ్‌ లోంచి వేడి వేడి టీ పోసి ఇచ్చాడు.
టీ తాగుత బుఖారీకి దగ్గరగా జరిగింది మాధవి. వెచ్చటి టీ గొంతులోకి జారుతుంటే హాయిగా వుంది. ఈ సీజన్‌లో ఇక్కడికి రావడం ఎంత బుద్ధి తక్కువో అర్థమైంది మాధవికి.
ఢిల్లీలో ఏదో మీటింగ్‌ అటెండవ్వ డానికి వచ్చింది. అది నిన్న ఉదయమే అయి పోయింది. తన పిన్ని కొడుకు సుధాకర్‌ శ్రీనగర్‌లో మిలటరీలో మంచి హోదాలో ఉన్నాడని ఎలాగైనా ఒకసారి శ్రీనగర్‌ వెళ్ళా లని వధవి ఎప్పటినుంచో అనుకుంటోంది. అయితే ప్రస్తుతం చాలా చలిగా వుంటుందని సుధాకర్‌ చెప్పినా విన కుండా వచ్చింది. సరే వస్తానంటే వద్దనడం ఎందుకులే అని సుధాకర్‌ ఊరుకున్నాడు.
”వదిన ఎపుడొస్తుందిరా” మాధవి అడిగింది.
”లంచ్‌ టైముకి వస్తుందిలే. ఏం ఆకలేస్తోందా?” నవ్వుతూ అన్నాడు సుధాకర్‌.
”ఆకలా? పాడా? పొద్దున్న తిన్నదే అరగలేదింకా”.
”రెండు రోజులైతే అలవాటవు తుందిలే. నేను బయటకెళ్ళి వస్తా. ఒక్కర్తివీ ఉండగలవా?”
”దివ్యంగా వుంటాను. నాకేం భయం. ఎవరైనా తుపాకులుచ్చుకుని వస్తా రంటావా?”
”దివ్యంగా వుంటానని మళ్ళీ తుపా కులంటావేంటీ?”
”ఏవె బాబూ! ఎక్కడ చూసినా సైన్యం, పోలీసులే. ఇక్కడ మామూలు మనుష్యుల కన్నా పోలీసులే ఎక్కువ వున్నట్టు న్నారు.”
”నేచురల్లీ! లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ చాలా వుంది. ఏ టైములో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు”.
”కన్పిస్తూనే వుందిగా. సరే. నేను టీవీ చూస్తుంటాను నువ్వెళ్ళిరా.” అంది ధైర్యంగానే.
”వద్దులే మధ! వదిన వచ్చాక వెళతాలే”
”అయ్యె! నీకేం పనులున్నాయె వెళ్ళరా! నిజంగానే చెబుతున్నా. నాకేం భయం లేదు.”
”అంత అర్జంటేమీ కాదులే. ఇవాళ ఎలాగ ఆదివారం కదా. ఆ… అన్నట్టు మర్చిపోయను. సాయంత్రం మనం డిన్నర్‌కి బయట కెళ్ళాలి. వదిన చెప్పిందా?”
”చెప్పలేదే! అయినా ఈ చలిలో బయటకెలా వెళతాంరా బాబూ”
”తప్పకుండా వెళ్ళాలి. మాపై ఆఫీసర్‌ కూడా వస్తాడు”
బయట కారాగిన చప్పుడైంది.
”వసు వచ్చినట్టుంది” సుధాకర్‌.
లాంగ్‌ కోటు, మంకీ కాప్‌తో వసుధ లోపలికొచ్చింది.
”తొందరగా వచ్చినట్టున్నావే”.
”అవును. మధుకోసం తొందరగా వచ్చేసా. అయినా హాస్పిటల్‌లో కూడా పని ఎక్కువ లేదు.”
వసుధ మిలటరీ హాస్పిటల్‌లో డాక్టరుగా పనిచేస్తోంది.
”వదినా బయటెలా వుంది”
”చలి గురించా. చలిగానే వుంది. మాకు అలవాటయి పోయిందిలే” అంది కోట, కాప్‌ తీసేస్త
”వసూ! ఈవినింగ్‌ డిన్నర్‌ గురించి మధుకి చెప్పలేదట.”
”అవును. ఉదయం హడావుడిలో మర్చిపోయను”.
”సరే! లంచ్‌ చేద్దామా!”
వంటచేసే హనీఫ్‌ వేడివేడిగా వడ్డించాడు.
”రాజ్‌వ కూర చాలా బావుంది. మదూ! ఇంకొంచెం వేసుకో” వసుధ.
”బావుంది. ఇవి మనవేపు బొబ్బర్లలాగా లెదు”.
”అదే జాతిలే. పన్నీర్‌ వేసుకో. ఈ చలికి బావుంటుంది”.
”మదు! నువ్వింకా కథల, కవితల రాస్తున్నావా? మానేసావా?”
”రాస్తూనే వున్నాను. ఈ మధ్యనే నా కథల సంకలనం వేసాను”
”అవునా! మరి నాకు పంపలేదే”
”నీకా?! నువ్వు కథలు కూడా చదువుతావా? తీవ్రవాదుల, ఎన్‌కౌంటర్ల వీటిలోనే మునిగి తేలతావనుకున్నాను”
”భలేదానివి మదు! అది ఉద్యోగం. అవన్నీ ఉద్యోగ ధర్మాలు. నేను కూడా రాసేవాడినని మర్చిపోయవా?”
”అవుననుకో. కాని అదెప్పటి మాట. నువ్వు సాహిత్యం సంగతే మర్చిపోయవనుకున్నాను”.
వీళ్ళిద్దరి సంభాషణని వసుధ ఆసక్తిగా వింటోంది. సుధాకర్‌ కథల గట్రా రాసేవాడని ఆమెకు అస్సలు తెలియదు.
”అలా అనుకోవడం నీ తప్పు. నిజమే చాలా కాలంగా నేనేమీ రాయలేదు. వసుకి నేను రచయితనని తెలియదు కూడా” అన్నాడు నిష్ఠూరంగా.
”ఒ.కె. ఒ.కె. సారీ! నా కథల పుస్తకం నా సూట్‌కేస్‌లో వుంది. ఇపుడే ఇస్తా సరేనా”
”ఇంత చిన్న విషయనికి సారీ ఎందుకులే గాని నేను చేస్తున్న ఉద్యోగం నాలో రచయితని చంపేసింది. అయితే నేను సియచిన్‌లో ట్రయినింగ్‌లో వున్నపుడు జరిగిన ఒక సంఘటన నన్ను కదిలించి చాలా సంవత్సరాల తర్వాత నా చేత కవిత్వం రాయించింది”
”సియచిన్‌ గ్లేసియర్‌లో ట్రయినింగ్‌ అయ్యవా”
నోరు వెళ్ళబెట్టి మరీ అడిగింది మధు.
”అవునే! సియచిన్‌ మంచుకొండల్లో మూడు నెలలున్నాను. అక్కడ ధవళ కాంతులీనే మంచు తప్ప మరేమీ వుండదు. మంచు తప్ప మరో ప్రాణి వుండదు”.
”అమ్మ బాబోయ్‌! ఎలా బతికేర్రా బాబూ!”
”నేనొక్కణ్ణే బతికాను. నా బాచ్‌లో ఐదుగురు చనిపోయరు” సుధాకర్‌ గొంతు భారంగా పలికింది.
వసుధ, మాధవి ఉలిక్కిపడ్డారు. ఈ విషయలేవీ తనతో ఎపుడ చెప్పలేదని ఆశ్చర్యపడింది వసుధ.
”అయ్యె! ఎంత ఘోరం. అలాంటి చోట ట్రయినింగ్‌ ఎందుకసలు” అంది మధు.
”ఆ రోజున ఏంజరిగిందో విను. మేం నిద్రలో ఉన్నపడు పెద్ద మంచుతుఫాను వచ్చింది. నా పక్క టెంట్‌లో వున్న నా బ్యాచ్‌మేట్ల టెంట్లన్నీ మంచులో కప్పడ పోయయి. లక్కీగా నా టెంట్‌కేమీ కాలేదు. మర్నాడు అతి కష్టం మీద వాళ్ళ మృత శరీరాలు మంచు తవ్వి తీసారు. నిద్రలోనే బిగుసుకు పోయరు. వెంటనే నన్ను కిందికి పంపేసారు. చాలా రోజులగ్గాని నేను కోలు కోలేకపోయను. కోలు కొన్నాక ఒక కవిత రాసాను. చాలా సంవత్సరాల తర్వాత రాసాను” ఎటో చూస్త చెబుతున్నాడు సుధాకర్‌.
వింటున్న వాళ్ళ హృదయలు బరువెక్కాయి. వసుధ లేచి వెళ్ళి సుధాకర్‌ దగ్గరగా కూర్చుని ”నువ్వెపుడ ఈ విషయలు నాకు చెప్పలేదే” అంది.
”ఎందుకో నాకు ఆ విషయం తలుచుకోబుద్ధి కాదు. ఆ రాత్రి నాతో సరదాగా కబుర్లు చెప్పిన ఐదుగుర అలా చనిపోవడం చాలా బాధాకరంగా అన్పించేది. ఇదిగో ఇపుడు మధు, నువ్వేం రాయడం లేదు అంటే అదంతా గుర్తొచ్చింది” అన్నాడు.
”అది సరేగాని. అంత చలివుండే సియచిన్‌కి కాపలా ఎందుకసలు?” ”బోర్డర్‌ కదా! వాచ్‌ తప్పదు. దీన్ని కాపలా కాయడంలో ఎందరో మిలటరీ వాళ్ళు చలికి చచ్చిపోతుంటారు. ఇటు, అటు కూడా” మధు బుర్ర గోక్కుంట చటుక్కున అంది ”దీన్ని కామన్‌ పీస్‌ ఏరియగా డిక్లేర్‌ చేస్తే బావుంటుంది కదా!”
”అద్భుతమైన ఐడియ! కాని ఎవరు చేస్తారు. సియచిన్‌ గ్లేసియర్‌లో ప్రతి రోజూ ఎవరో ఒకరు చావాల్సిందే. మనం ‘లేహ్‌’ వెళ్ళగలిగితే అక్కడున్న ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ మ్యూజియంలో సియచిన్‌ సైనికులు వేసుకునే ప్రత్యేక డ్రెస్సులు, షూస్‌, ఫోటోలు చూడొచ్చు” అన్నాడు.
”లేతహ్‌ వెళ్ళడం ఇపుడు కుదరదు. నువ్వా చలి భరించలేవు. మే, జూన్‌ అయితే చాలా బావుంటుంది” అంది వసుధ.
అప్పటికి తినడం పూర్తయింది. హనీఫ్‌ వేడివేడిగా టీ యిచ్చాడు. టీ తాగేసి సుధాకర్‌ బయటకెళ్ళిపోయడు.
”మధ! నువ్వు రావడం వల్ల నాకు రెండు విషయలు కొత్తగా తెలిసాయి. థాంక్స్‌ టు యూ” అంది వసుధ.
”అవును. వీడు చాలా సెన్సిటివ్‌. వాడిదీ నాదీ ఒకే ఈడు. నాకన్నా ఆరు నెలలేవె పెద్దవాడు. మా ఊళ్ళో స్కూల్‌ లేకపోవడంతో నా స్కూల్‌ చదువంతా వీళ్ళ ఊరిలో వీళ్ళింట్లో వీడితోనే అయింది” అంది మాధవి.
”అది తెలుసు. తనే చెప్పాడు. రాస్తాడని మాత్రం ఈ రోజే తెలిసింది”
”చాలా బాగా రాసేవాడు. కథల కన్నా కవిత్వం రాయడం తనకిష్టం. నాకు కథలు రాయడం ఇష్టం”.
”బావుంది. అన్నా చెల్లెళ్ళిద్దర రైటర్స్‌ అన్న విషయం దాచిపెట్టారన్నవట” అంది నవ్వుతూ
”మేమ్‌ సాబ్‌! ఆప్‌కేలియే కోయీ ఆయ” అన్నాడు హనీఫ్‌.
”ఠీక్‌ హై! మై అభీ ఆవూంగీ. వున్‌ కో బిఠాదో” అంది వసుధ.
”మదు! కాసేపు పడుకోరాదు! నేనిపుడే వస్తా”
‘సరే’ అంట ్మాధవి తనకిచ్చిన రూమ్‌లోకెళ్ళింది. కాసేపు టీవీ ొచూసింది. నేషనల్‌ జియొగ్రాఫికల్‌ ఛానల్‌లో అంటార్కిటికా మీద ఏదో ప్రోగ్రామ్‌ వస్తోంది.
వెంటనే సియచిన్‌ గ్లేసియర్‌ గుర్తొచ్చింది. ఆ మంచులో కప్పడిపోయిన ఐదుగురు గుర్తొచ్చారు. వాళ్ళ కుటుంబాల వాళ్ళు గుర్తొచ్చారు.
అయ్యె! అన్పించింది. ఆలోచనల్లో వుండగానే వగన్నుగా కునుకు పట్టింది మాధవికి.
మెలుకువ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ చలిగా అన్పించింది. రూమ్‌లో హీటరుంది. బద్ధకంగా అలాగే మంచంలో పడుకుని వుంది.
”మదు! లేచావా!” అ౦టూ వచ్చాడు సుధాకర్‌.
”ఆ…. లేచాను. నువ్వొచ్చి ఎంత సేపయ్యింది”.
”చాలా సేపయ్యింది. టైమెంతో తెలుసా? ఆరు. మొద్దులా నిద్రపో్యావ్‌”.
”హవ్మె! ఆరయ్యిందా? వదిన లేపొచ్చుగా”.
రెండు సార్లు వచ్చింది. నువ్వేమొ గురకలు పెట్టి నిద్రపోతున్నావ్‌” హాస్యంగా అన్నాడు.
”గురకా? ఛీ… ఛీ నేను గురక పెట్టను”
”నీకెలా తెలుస్తుందేమిటి? గురక నిద్దరోతున్నపుడు వస్తుంది”.
”అవునా? నాకు తెలియదులే. నేనింకా మెలుకువగా వున్నప్పుడు వస్తుందనుకున్నాను” అంది నవ్వుతూ.
ఇద్దర గట్టిగా నవ్వుతంటే వసుధ వచ్చి ”ఏమిటి? ఇద్దర తెగ నవ్వుతున్నారు. ఏం తల్లీ నిద్ర సరిపోయిందా? కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోయవ్‌”.
”అంటే నేను కుంభకర్ణుణ్ణని నీ ఉద్దేశమా”
”ఉండొచ్చు” అంది వసుధ నవ్వుతూ.
”అది సరేగాని, ఈ డిన్నర్‌కి నేను రాకపోతే ఏమౌతుంది” అంది ొమాధవి.
”ఏమీ కాదు. ఇంట్లో నీకు బోరు కొడుతుంది. ఎందుకు రానంటున్నావ్‌?
”వాళ్ళెవరో ఏంటో! నాకు పరిచయం లేదుగా”.
”ఏం ఫర్వాలేదు. ఎవరూ ఏమీ అనుకోరు. లేచి తయరవ్‌. మనం ఏడింటికల్లా బయటపడాలి”.
”ఒరేయ్‌! సుధా! ఇంతకీ మనం వెళుతున్న పార్టీ సందర్భం ఏమిటో చెప్పనే లేదు”. కారులో కూర్చున్నాక మాధవి అడిగింది.
”ఇక్కడి ఎస్‌.ఎస్‌.పి. కి ప్రమొషన్‌ వచ్చింది. అతని కొడుకు బర్త్‌డే కూడా నట”. అన్నాడు సుధాకర్‌. ”అలాగా” అంటుండగానే కారు ఓ ఇంటి ముందు ఆగింది. కారులో హీటర్‌ వుండడం వల్ల వెచ్చగానే వుంది.
ఆ చలిలో కారుదిగి బయటకు రావాలంటే ప్రాణాంతకంగా అన్పించింది మాధవికి.
ఎస్‌.ఎస్‌.ప.ిఇనాయత్‌, ఆయన భార్య తబస్సుమ్‌ వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే లోపల చాలా మంది వచ్చి వున్నారు. పోలీస్‌, మిలటరీ అధికారుల్తో హాలంతా నిండిపోయింది. హాల్లో సన్నటి వెలుతురు పరుచుకుని వుంది. మంద్రంగా సంగీతం వినబడుతోంది. తబస్సుమ్‌ ఆడవాళ్ళ కూర్చున్న దగ్గరికి వచ్చి అందరినీ పలకరించింది. మాధవి కన్నార్పకుండా ఆమెనే చూడసాగింది. ఎంత అందంగా వుందీమె. విలక్షణమైన కాశ్మీరీ పోలికల్తో తెల్లగా, సన్నగా, నాజూగ్గా మెరిసిపోతోంది. వయసు ఏభై పైనే వుండొచ్చు. కాని అలా అన్పించడం లేదు. వసుధ, ొమాధవిని ఆమెకి పరిచయం చేసింది. ఆత్మీయత ఉట్టిపడే కంఠంతో మాధవిని పలకరించి కుడిచేతి మీద ముద్దుపెట్టింది. మాధవికి గమ్మత్తుగా అన్పించింది.
గ్లాసుల గలగలలు మొదలయ్యయి. ఘుమఘుమలాడే నాన్‌వెజ్‌ కాశ్మీరీ వంటకాల వాసనలు హాలంతా కమ్మేసాయి.
హాలుకు ఒక వైపున అందంగా అమర్చిన టేబుల్‌ మీద గులాబీ రంగు కాక్‌ వుంది.
”హేపీ బర్త్‌ డే టు అన్వర్‌ ” అని రాసిన ప్లేకార్డ్‌ వుంది.
అందరూ ఆ టేబుల్‌ వేపు నడిచారు. లోపల్నించి ఐదేళ్ళ కుర్రాడిని తీసుకొచ్చిందొకామె. కాశ్మీరీల సంప్రదాయ డ్రస్‌లో, తలమీద రమీ టోపీతో కుర్రాడు ముద్దుగా వున్నాడు. అయితే ఆ పిల్లాడు తబస్సుమ్‌ కొడుకంటే ఆమెకి నమ్మకం కలగలేదు. ఆ వయస్సులో వీళ్ళకింత చిన్న కొడుకా?
”వీడు వీళ్ళ మనవడేవె వదినా” అంట గుసగుస లాడింది వసుధ చెవిలో.
”కాదట. కొడుకేనట”.
”సుధా గాడేడీ! వాడినే అడుగు దాం” చుట్ట చూసింది కాని సుధాకర్‌ దగ్గర్లో కనబడలేదు. దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
అన్వర్‌ కేక్‌ కట్‌ చేసాడు. అందర చప్పట్లు కొట్టారు. ఇనాయత్‌, తబస్సుమ్‌లు వాడి నోటిలో కేక్‌ పెట్టి ఫోటోలు తీయించు కున్నారు.ఆ తర్వాత అన్వర్‌ని లోపలి గదిలోకి తీసుకెళ్ళిపోయరు. డ్రింక్స్‌, కబాబ్స్‌ సర్వ్‌ చేసారు. ఎవరి కిష్టమైన డ్రింక్‌ వాళ్ళు తాగుత కబుర్లలో పడ్డారందరూ.
వైన్‌, జిన్‌ లాంటివి ఆడవాళ్ళవేపు వచ్చాయి. మటన్‌ బాల్స్‌ నములూతూ, వైన్‌ సిప్‌ చేస్త ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు.
డిన్నర్‌ కంప్లీట్‌ అయ్యేవరకు సుధాకర్‌ వీళ్ళ వేపు రానేలేదు.
పదకొండు గంటలకి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంట ఇళ్ళకి బయలు దేరారు.
కారులో కూచున్నాక వెంటనే మాధవి అడిగిన మొదటి ప్రశ్న అన్వర్‌ గురించే.
”సుధా! అన్వర్‌ చాలా చిన్నగా వున్నాడు. వీళ్ళ కొడుకేనా? లేక వాళ్ళ మనవడా?” మాధవి
”కొడుకూ కాదు మనవడూ కాదు”.
”ఏమిట్రోయ్‌! మందెక్కువయ్యిందా”
”నిజమే. అన్వర్‌ని వీళ్ళు పెంచుకున్నారు”
”అలా చెప్పు. అదీ సంగతీ”. అంది మాధవి.
”పెంచుకోవడం అంటే దత్తత తీసుకోలేదు. ఒక ఆపరేషన్‌లో అన్వర్‌ వీళ్ళకి దొరికాడు”.
”ఆపరేషన్‌లో దొరకడమేమిటి? వదినా! వీడికి నిజంగానే మందెక్కువ య్యింది”. నవ్వుత అంది మాధవి. వసుధ కూడా నవ్వింది.
”అబ్బ! ఊరుకుంద! నేను ఎక్కువ తాగనని నీకు తెలుసు. కంపెనీ కోసం కొంచం తీసుకుంటాను. సరే! నీ అను మానాలన్నీ తీరాలంటే మొత్తం చెప్పాల్సిందే”.
”చెప్పు చెప్పు” అంట తొందర పెట్టింది.
”నీకు తెలుసు కదా మదు! ఇక్కడ తీవ్రవాదుల ప్రాబ్లమ్‌ గురించి. ఎన్‌ కౌంటర్ల, కూంబింగ్‌ ఆపరేషన్‌లు, కిడ్నాప్‌లు నిత్యం జరుగుతుంటాయి. ఇనాయత్‌ ఇలాంటి ఒక ఆపరేషన్‌లో పాల్గొన్నపుడు అన్వర్‌ దొరికాడు.
”అంటే….’మాధవికి కొంచెం అర్థమయ్యింది.
”ఒక రోజున ఒక ఇంట్లో తీవ్ర వాదులు దాక్కున్నారని ఇనాయత్‌కి ఇన్‌ఫర్‌మేషన్‌ వచ్చింది. ఆయన బలగాలతో ఆ ఇంటిమీద దాడిచేసాడు. ఆ దాడిలో ఇంట్లో వున్న వాళ్ళందర చనిపోయరు. గమ్మత్తుగా అన్వర్‌ గాయలేమీ కాకుండా బతికి బయటపడ్డాడు”.
”నిజంగా ఆ యింట్లో తీవ్రవాదులు దాక్కొన్నారా”.
”లేదని తర్వాత తెలిసింది. అన్వర్‌ తల్లి, తండ్రి, చెల్లి ఆ దాడిలో చనిపోయరు”.
మాధవికి కడుపులోంచి ఏదో తెళ్ళుకొస్తున్నట్లనిపించింది.
”అన్వర్‌ అమ్మా నాన్న అమాయ కులు. పేదవాళ్ళు. ఇనాయత్‌కి వచ్చింది తప్పుడు ఇన్‌ఫర్‌మేషన్‌. అతడి భార్య తబస్సుమ్‌ బలవంతంమీద అన్వర్‌ని తెచ్చుకుని పెంచుతున్నారు.
”ఒక్కసారి కారాపు” అని అరిచింది మాధవి.
సడన్‌ బ్రేక్‌తో కారాగింది.
గబుక్కున డోర్‌ తీసి భళ్ళున వాంతి చేసుకుంది మాధవి. సుధాకర్‌ వసుధ గాభరాపడ్డారు. ”ఏమైంది మధ! ఫుడ్‌ పాయిజనింగయ్యిందేమిటి?”
”ఏం ఫర్వాలేదులే. ఈ వాంతి అవ్వకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఛీ…ఛీ…. ఇలాంటి ఇంటికి తీసుకొచ్చా వేమిటి? అమాయకుల్ని పొట్టన పెట్టుకుని, రక్తపు చేతులతో వాళ్ళ బిడ్డని పెంచడానికి వీళ్ళకి సిగ్గులేద! తన అమ్మా, నాన్న చెల్లెల్ని చంపిన వాడే తనని సాకుతున్నాడని పాపం అన్వర్‌కి తెలియదు. ఎంత ఘొరం! కోపంగా అంది మాధవి.
”మదు! అనవసరంగా ఆవేశ పడకు. కాశ్మీర్లో ఇలాంటివి మామూలే. అన్వర్‌ని పెంచుకుంటున్నందుకు అందర ఇనాయత్‌కి తెగపొగుడుతుంటేను. అనాధలా వదిలేయకుండా…”.
సుధాకర్‌ మాటలు పూర్తికాకుండానే మాధవి ”అనాథని చేసిందెవరు?” అంటూ గయ్‌మంది.
”సుధా! ఇంక వాదించకు. ఆ విష యం ముందు తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు. నాక్కూడా ఏమిటో కడుపులో తిప్పుతున్నట్టు గా వుంది” అంది వసుధ.
సుధాకర్‌ మాట్లాడకుండా కూర్చున్నాడు.
అన్వర్‌ అమాయకమైన ముఖం గుర్తొచ్చి మాధవి భారంగా నిట్తూర్చింది. అన్వర్‌కి జరిగిన అన్యాయన్ని పట్టించు కోకుండా దొంగ చేతికే తాళాలిచ్చినట్లు తన కుటుంబాన్ని చంపినవాడి కొడుకుగా చెలామణి కమ్మని ఆదేశించడం ఎంత అన్యాయం. పైగా అతనికి ప్రవెషన్‌లు, పొగడ్తలు.
ఇక్కడ ఇలాంటివి మామూలే అంట సమర్ధిస్తున్న సుధాకర్‌ వేపు చూస్త ”నేను రేపు వెళ్ళిపోతాను” అంది హఠాత్తుగా.
”రేపేనా? ఎందుకు?
”ఏవె! నాకిక్కడ ఉండాలన్పించ డం లేదు”.
అన్వర్‌ ముద్దు ముఖం ఆమె కళ్ళల్లోంచి చెదిరిపోవడం లేదు.
ఇనాయత్‌ని తల్చుకోగానే ఆమెకి టాల్‌స్టాయ్‌ ‘విందు తర్వాత’ కథలో మిలటరీ అధికారి గుర్తొచ్చాడు. నిశ్శబ్ధంగా కారుదిగి ఇంట్లోకి వెళుతున్న మాధవిని చూస్త నిలబడ్డారు సుధాకర్‌, వసుధలు.
(బుఖారి : కాశ్మీర్‌ లాంటి చలిప్రదేశాల్లో వెచ్చదనం కోసం ఏర్పాటు చేసుకునేది. ఒక స్తంభంలాంటి కట్టడం. దానిలో నిత్యం బొగ్గుగాని, గ్యాస్‌గాని వుంచి వెలిగిస్తే గదంతా వెచ్చగా వుంటుంది.
సవెవాయ్‌ : టీ కాచుకునేది. చిన్న సైజు బాయిలర్‌ లాగా వుంటుంది.
కాంగ్ది : నిప్పుల కుంపటి. కాశ్మీరీలు చలికాలంలో దీన్ని దుప్పట్లో పెట్టుకుని పడుకుంటారు.)

గంగకి వరదొచ్చింది

(గ్రామీణ మహిళల్ని పీక్కు తింటున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఆగడాల గురించిన కధ)
 అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక కూడా అలాగే వున్నాయి.


బలవంతంగా మంచం మీంచి లేచి అద్దం దగ్గరికి వెళ్ళి కళ్ళకేమయిందో అనుకుంటూ చూసుకుంది. కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. కన్రెప్పలు ఉబ్బి ముఖమంతా జేవురించింది. ఇది తన ముఖమేనా? తన ముఖమెంత ప్రశాంతంగా వుండేది. ఎంత హాయిగా నిద్రపోయేది. రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేచేది కాదు. కళ్ళనిండా నిద్రపోయి ఎంత కాలమైంది? ఏమైంది తనకి? మళ్ళీ మంచంలో కూలబడింది. లేచి బయటకు వెళ్ళాలన్పించడం లేదు గంగకు. ఈ చీకట్లో అలాగే పడుకోవాలన్పిస్తోంది. వెలుగు ముఖం చూడాలన్పించడం లేదు. చుట్టు పక్కల వాళ్ళకు ముఖం చూపించాలంటేనే గంగకు ఇష్టమవ్వడం లేదు. అందరికీ తలలో నాలుకలా వుండే తనకు ఈ సమస్య ఎందుకొచ్చిందో గంగకు తెలుసు. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో మాత్రం అర్థం కావడం లేదు. మంచం మీద వెల్లకిలా పడుకుని అటకవేపు చూస్తోంది. చూపు ఒకచోట నిలవడం లేదు. కళ్ళు మూసుకు పడుకుందామంటే కళ్ళు మూతలు పడడం లేదు. ఇంట్లో అలికిడి లేదు. కొడుకు పొలమెళ్ళిపోయి వుంటాడు. కోడలు దూళ్ళ దగ్గరుండి వుంటుంది. ఇంత పొద్దెక్కినా తనని ఎవరూ లేపలేదు. నిన్న తనకి జరిగిన అవమానం వాళ్ళ ముందే జరిగింది. ఎవరిని ఎవరూ అపే పరిస్థితి లేదు. ఎవరిని ఎవరూ ఆదుకునే ప్రయత్నం లేదు.
***
గంగకి తాను మొదటిసారి డ్వాక్రా గ్రూపు మీటింగ్‌కి వెళ్ళిన రోజు గుర్తుకొచ్చింది. ఎంత ఉత్సాహంగా వెళ్ళింది. ఊళ్ళో ఆడవాళ్ళంతా సమావేశమైన సందర్భమది. గంగకి మొదటిసారి తాను విన్న ఉపన్యాసం గుర్తొచ్చింది. ఏదో గవర్నమెంటు ఆఫీసునుంచి వచ్చినావిడ మాట్లాడుతుంటే ఎంతో ఆసక్తిగా విన్నది తాను.

“మీరందరూ పొదుపు చెయ్యాలి. పదిహేను మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలి. మీ పొదుపు సొమ్మును బ్యాంకులో వేసుకోవాలి. దానిమీద మేము రుణాలిస్తాం. ఆ సొమ్ముతో మీరేదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అందరూ కలిసి కూడా బిజినెస్ చెయ్యొచ్చు. డబ్బు కోసం మీరు మీ భర్తల మీద ఆధారపడక్కరలేదు. మీ చేతుల్లో నాలుగు డబ్బులాడితే మీ గౌరవం పెరుగుతుంది.” అంటూ చాలా చక్కగా చెప్పింది. గంగతో సహ వింటున్న ఆడవాళ్ళ ముఖాల్లో ఎంతో ఆసక్తి. ఇలాంటి విషయాలు వాళ్ళ జీవితంలో ఎపుడూ వినలేదు. ఇంతమంది ఆడవాళ్ళు ఆరుబయట సమావేశమవ్వడం వాళ్ళెపుడూ చూడలేదు.
ఆవిడ ఇంకా ఇలా చెప్పింది. ఊళ్ళో ఆడవాళ్ళందరూ ఏకమైతే బావుంటుంది. నెల్లూరులోని ఒక గ్రామంలో ఆడవాళ్ళందరూ ఏకమై సారాకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసారు. మీరంతా కూడా ఐకమత్యంతో వుంటే ఏదైనా సాధించవచ్చు అంటూ ఎన్నో విషయాలు చెప్పింది. ఆమె నెలకొకసారి వచ్చి ఇలా మీటింగ్‌లు పెట్టి ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్పేది. గంగకి ఆమె చెప్పే విషయాలు చాలా నచ్చేవి. అడిగి అడిగి తెలుసుకునేది. ఇన్ని రోజులూ మగవాళ్ళే వ్యాపారాలు చేసి, సంపాదించడం తెలుసు. తాము కూడా వ్యాపారం చేయ్యొచ్చని ఆమె చెప్పడం ఎంతో వింతగా అన్పించింది. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కన్పడినా ఈ విషయాలే మాట్లాడుకునేవారు. గవర్నమెంటామె లేకుండా తాము మొదటిసారి కలుసుకుని మాట్లాడు కొన్న సంగతులు గుర్తొచ్చాయి గంగకి.
ఊళ్ళోని పదిమంది ఆడవాళ్ళు సిగ్గుపడుతూ, బిడియంగా గంగవాళ్ళింటికి వచ్చారు. మొగాళ్ళు పొలాలకి, పనులకి వెళ్ళిపోయాక వాళ్ళు కలుసుకుందామను కున్నారు. వాళ్ళొచ్చేసరికి గంగ తయారుగా వుంది. వీధరుగు మీద ఈతాకుల చాప పరిచింది. గంగ ప్రేరేపణతోటే వాళ్ళంతా ఊళ్ళోని పదిమంది ఆడవాళ్ళు సిగ్గుపడుతూ, బిడియంగా గంగవాళ్ళింటికి వచ్చారు. మొగాళ్ళు పొలాలకి, పనులకి వెళ్ళిపోయాక వాళ్ళు కలుసుకుందామనుకున్నారు. వాళ్ళొచ్చేసరికి గంగ తయారుగా వుంది. వీధరుగు మీద ఈతాకుల చాప పరిచింది. గంగ ప్రేరేపణతోటే వాళ్ళంతా వచ్చారు.
“గంగొదినా! నువ్వు రమ్మన్నావని వచ్చాను గానీ మా ఆయనకిష్టం లేదు” అంది. గంగ ఇంటిపక్కనే వుండే వెంకమ్మ.
అవునొదినా! నేనూ అంతే. ఆ గవర్నమెంటామె ఏమేమో చెబుతుంది గాని అవన్నీ మన వల్ల అవుతాయంటావా? రాజమణి అంది.
“మీరేమైనా అనండి. ఆమె చెప్పే విషయాలు నాకు చాలా బావుంటున్నాయి. మనందరం కలిసి ఒక గ్రూపుగా అవుదాం. పొదుపు చేద్దాం. దీన్లో తప్పేముంది” అంది గంగ.

“పొదుపు చెయ్యడానికి మనకి డబ్బులెలా వస్తాయొదినా! అయినా ఈ పొదుపులు అవీ చేసి ఏం చేయాలి మనం” ఆదెమ్మ సందేహం.
“ఆదెమ్మా! నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. మండలాఫీసు నుంచి ఆమె వస్తానందిగా. ఆమెనే అడుగుదాం”.
“రాజమణీ! కొత్తగా గేదెను కొన్నట్టున్నారు. పాలిస్తుందా”
“ఎక్కడ పాలూ. సూడిగేదె. వచ్చే వినాయక చవితి నాటికి ఈనుతుంది”
“అలాగా! అయితే మాకందరికి జున్ను దొరుకుతుందన్నమాట” అందరూ నవ్వారు ఆ మాటకి.
ఆ మాటా ఈ మాటా మాటాడుకుంటూ కూర్చున్నారు. ఇంటి విషయాలు , భర్తల, పిల్లల విషయాలు మాట్లాడుకుంటూ, పరాచకాలాడుకుంటున్న సమయంలో మండలాఫీసునుంచి అరుంధతి వచ్చింది. ఆమె రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆమె కోసం కుర్చీ తెచ్చి వేసారు గాని అరుంధతి వాళ్ళతో పాటే కిందే చాపమీద కూర్చుంది.
“అందరూ వచ్చినట్టేనా! ఇంకా ఎవరైనా రావాలా?”
“ఆయ్! అందరూ వచ్చేసారండి” అంది గంగ. అరుంధతి పొదుపు చేయడంలోని లాభాల గురించి, అన్ని గ్రామాల్లోను ఆడవాళ్ళు ఎలా పొదుపు చేయడం మొదలు పెట్టారో చాలా వివరంగా చెప్పసాగింది.
వింటున్న ఆడవాళ్ళకి ఎన్నో అనుమానాలొచ్చాయి. అన్నింటికి చాలా ఓపిగ్గా అరుంధతి సమాధానాలు చెప్పింది.
“మేము పదిహేను మందిమి పోగడ్డాం. పొదుపు మొదలుపెట్టొచ్చా?” గంగ ఉత్సాహంగా అడిగింది.
 పెట్టొచ్చు. మీ గ్రూప్కి ఒక పేరు పెట్టుకోండి” అంటూ వివరాలన్నీ చెప్పింది.
“కనకదుర్గమ్మ పొదుపు సంఘమని పేరు పెట్టుకుంటాం” అంది ఆదెమ్మ.
“వెరీగుడ్, పేరు కూడా పెట్టేసు కున్నారా? మరింక అడ్డేముంది?” పొదుపు చేసిన డబ్బును పోస్టాఫీసులో ఎలా వెయ్యాలో, పుస్తకాల్లో ఎలా రాసుకోవాలో వివరాలన్నీ అడిగి తెలుసుకుంది గంగ.
***
రాత్రి భోజనాల వేళపుడు భర్తకి ఉత్సాహంగా అన్ని విషయాలు చెప్పింది. శ్రీనివాసులు ఉలుకు పలుకు లేకుండా విన్నాడు.
“నేనింత ఉత్సాహంగా చెబుతుంటే ఏం మాట్లాడవేంటి”.
“ఏం మాట్లాడను. నువ్వు ఇల్లొదిలి ఊరిమీద తిరుగుతానంటే నోరు మూసుక్కూచోక ఏమనమంటావ్” నోరు విప్పాడు.
“ఊళ్ళో ఆడాళ్ళం కలిసి మాట్లాడు కోవడం అంటే ఊరిమీద తిరగడమేనా?” గయ్మంది గంగ.
“అబ్బ! నీ చావేదో నువ్వు చావు. నా జోలికి రాకు”. తింటున్నవాడల్లా కంచం తోసేసి లేచిపోయాడు శ్రీనివాసులు.
ఉస్సురంది. తన ఉత్సాహం మీద పేడనీళ్ళు చిలకరించినట్టన్పించి నిట్టూర్చి తనూ లేచిపోయింది.
***
శ్రీనివాసులు చీదరించినా గంగలో ఉత్సాహం తగ్గలేదు. కనకదుర్గమ్మ సంఘానికి ప్రెసిడెంటయ్యింది. వారం వారం సంఘం వాళ్ళు కలవడం మొదలుపెట్టారు. మొదట్లో పొదుపు గురించే మాట్లాడుకునేవాళ్ళు. నెలకోసారి అరుంధతి వచ్చి మీటింగ్‌ పెట్టేది. పక్క గ్రామాల్లో ఏం జరుగుతోందో చెపుతుండేది. అకౌంటు పుస్తకాలు ఎలా రాసుకోవాలో, వసూలైన పొదుపు సొమ్మును పోస్టాఫీసులో ఎలా జమ చేసుకోవాలో చెప్పేది. గంగ చాలా శ్రద్ధగా విని, అరుంధతి చెప్పేవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేది.
ఒకసారి అరుంధతి మీటింగ్‌లో ఒక కొత్త విషయం చెప్పింది. గ్రామాల్లోని అన్ని సంఘాల ప్రెసిడెంట్లకు నాయకత్వ లక్షణాల గురించి జిల్లా స్థాయిలో ఏలూరులో శిక్షణ నిస్తున్నారని, గంగను కూడా హాజరవ్వమని చెప్పింది.
“నాయకత్వ లక్షణాలా? అవేంటి? ఏలూరెళ్ళాలా? మా ఆయనొప్పుకోడు” అంది గంగ.
“నాయకత్వమంటే మరేంలేదు. నువ్వు చేసిందే. మీ గ్రామంలో సంఘం పెట్టడానికి నువ్వెంతో చొరవ చూపించావు. నలుగుర్ని కూడేసావు. వాళ్ళందర్ని ఒప్పించి సంఘం పెట్టుకునేలా చేసావు. ఇవే నాయకత్వ లక్షణాలంటే. చాలా గ్రామాల నుంచి చాలా మంది ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళందరిని కలవొచ్చు” అంది అరుంధతి.
“ఊళ్ళో మీటింగ్‌కే వద్దంటాడు నా మొగుడు. ఏలూరెళతానంటే ఒప్పు కుంటాడా?” అనుమానంగా అంది గంగ.
ప్రయత్నం చెయ్యండి. వెళితే మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు”. అంటూ సమావేశం ముగించి అరుంధతి వెళ్ళిపోయింది.
 
***

శ్రీనివాసులు ససేమీరా వెళ్ళొద్దన్నాడు. సంఘాలు పెట్టి ఊళ్ళోని ఆడవాళ్ళు చెడిపోతున్నారని రంకెలు వేసాడు. జల్సాలు చెయ్యడానికే ఏలూరెళుతున్నారని తిట్టాడు. గంగ దేనికీ బెదరలేదు. నయానా, భయానా చెప్పి ఒప్పించింది. ఊళ్ళోంచి ఆరుగురు ఆడవాళ్ళు బయలుదేరి ఏలూరు వెళ్ళారు. గంగ ఇంతకు ముందెపుడూ ఏలూరు చూళ్ళేదు. అంతమంది ఆడవాళ్ళని చూళ్ళేదు. శిక్షణా తరగతుల్లో తనలాంటి ఆడవాళ్ళు ఎంతో ధైర్యంగా ఎన్నో విషయాలు మాట్లాడ్డం చూసి గంగ ఆశ్చర్యపోయింది. ఆ శిక్షణలో ఆరోగ్యం గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి, ఐకమత్యం గురించి, పొదుపు గురించి తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని విషయాలు వింది. లోకంలో ఇన్ని సంగతులున్నాయా అని ఆశ్చర్యపోయింది.వాళ్ళూ, మగవాళ్ళూ సమానమేనని, మగవాళ్ళకున్న అన్ని హక్కులూ ఆడవాళ్ళకి కూడా వున్నాయని విన్నపుడు నమ్మలేకపోయింది. శిక్షణా తరగతులు పూర్తయ్యేసరికి గంగలో మార్పు డింది. కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు మనసునిండా నింపుకుని గ్రామానికి తిరిగి వచ్చింది.
 
***
 
కనకదుర్గమ్మ సంఘం సమావేశాలు రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. గంగ ఆధ్వర్యంలో సంఘం పొదుపులో ముందుంది. ప్రభుత్వ రుణం కూడా మంజూరైంది. తనకు వచ్చిన రుణంతో గంగ ఒక గేదెను కొంది. శ్రీనివాసులు కూడా మునపటిలా నసపెట్టడం మానేసాడు. గ్రామానికి వచ్చే అధికారులు గంగతో మాట్లాడేవారు. గంగ వాళ్ళతో ధైర్యంగా మాట్లాడ్డం అతనిలో కొంత మార్పు తెచ్చింది. గంగ పట్ల మర్యాదగా మసలక తప్పదని అతనికి అర్థమైంది. ఇపుడేమో గంగ ఇంటికోసం పాడిగేదెను కొనగలిగింది. తన వల్లకాని పనిని గంగ చేసి చూపించింది. గంగ మీటింగులని తిరుగుతున్నా శ్రీనివాసులు ఏమీ అనలేకపోతున్నాడు.
సంఘం మీటింగుల్లో పొదుపే కాకుండా అనేక ఇతర విషయాల గురించి కూడా చర్చించడం మొదలు పెట్టారు. శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడుకోవడం, గ్రామంలో సమస్యల గురించి చర్చించడం తమకి ఏమైనా అనుమానాలుంటే అరుంధతిని అడగడం చేస్తున్నారు. సంఘంలో ఒక సభ్యురాలికి ఏదైనా కష్టం కలిగితే అందరూ ఆదుకోవడం, ఇంటి విషయాలు అందరూ పంచుకోవడంతో సంఘంలోని వాళ్ళకి ఒకరిపట్ల మరొకరికి అవగాహన పెరిగింది.

***
“గంగొదినా! ఈ సంగతి ఇన్నావా?” అంటూ వచ్చింది ఈశ్వరి.
“ఏం సంగతి? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది” అంది గంగ.
“రాత్రి ఆదెమ్మ మొగుడు తాగొచ్చి నానా గొడవా చేసాడంట. ఆదెమ్మను కొట్టి బయటకు గెంటేసాడంట”.
“ఏం పోయేకాలమొచ్చిందంట. రాత్రి నేను ఏలూరు నుంచి వచ్చేటప్పటికి బాగా ఆలస్యమైంది. ఎందుకు గొడవైందసలు”.
“ఎందుకేంటొదినా! మనం రుణం కింద డబ్బులు తీసుకున్నాం కదా! అవి తనకివ్వమని కొడుతున్నాడంట”
“తాగి తందనాలాడ్డానికా? పద ఆదెమ్మ ఇంటికెళదాం”
ఇద్దరూ ఆదెమ్మ ఇంటికి బయలు దేరారు. దారిలో మిగతా సంఘం సభ్యుల్ని కూడా పిలుచుకుంటూ, ఆమాటా ఈమాటా చెప్పుకుంటూ ఆదెమ్మ ఇంటికొచ్చారు.
“ఆదెమ్మా! ఏం చేస్తున్నావ్ లోపల” గంగ పిలిచింది.
“ఆదెమ్మ రాదు. ఫొండి… దొంగ…” ఆదెమ్మ మొగుడు బయటకొచ్చి బూతులందుకున్నాడు. పట్టపగలు ఫుల్‌గా తాగున్నాడు.
“ఈడికేం పోయేకాలం! ఇంత పొద్దున్నే తాగేసాడు”
“ఆదెమ్మా! లోపలున్నావా?” గంగ గట్టిగా కేకేసింది.
“నీ యమ్మ! అది రాదంటే ఇనపడలేదా! దొంగ లం…” నోటికొచ్చిన బూతులు తిడుతున్నాడు.
ఆదెమ్మ ఏడుస్తూ బయటకొచ్చింది. ఆమె జుట్టు పట్టుకుని లాగుతూ లోపలకు గెంటేసాడు. ఆదెమ్మ కిందపడిపోయింది. కింద పడిన ఆమెను ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో తన్నడం మొదలెట్టాడు. చూస్తున్న ఆడవాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. అంతే. ఒక్కసారిగా అతని మీదకి లంఘించి, బయటికి ఈడ్చుకొచ్చారు. అతను పెడబొబ్బలు పెడుతూ తిట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఎవరో తాడు తెచ్చారు. పెరట్లో వున్న కొబ్బరి చెట్టుకు అతన్ని కట్టేసారు. ఈ గొడవకి ఊళ్ళోని చాలామంది అక్కడ చేరారు. ఆదెమ్మ భయపడుతూ నిలబడి వుంది.
గంగ ఆవేశంతో ఊగిపోతూ “ఈరోజు నుండి ఊళ్ళో తాగొచ్చి పెళ్ళాలని కొట్టేవాళ్ళకి ఇదే శిక్ష. మేం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే మీరు తాగొచ్చి మమ్మల్ని తంతారా?”
మిగతా ఆడవాళ్ళంతా కూడా “అంతే… అంతే…” అంటూ గట్టిగా అరిచారు. తాగుబోతుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి.
***
ఆ సంఘటన తర్వాత కనకదుర్గ సంఘం సభ్యులంటే ఊళ్ళో గౌరవం పెరిగింది. మగవాళ్ళు తాగుడు మానేయలేదు కాని గొడవలు చేయడం తగ్గించేసారు. లేకపోతే ఆదెమ్మ మొగుడికి పట్టిన గతే తమకీ పడుతుందని భయపడ్డంతో ఇళ్ళల్లో కొంత శాంతి నెలకొంది.
పొదుపు సంఘాల సమావేశాలలో పొదుపు విషయాలే కాక, తమ సమస్యల గురించి చర్చించేవారు. ఇంటి గొడవల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారు కాబట్టి ఇళ్ళల్లోను గౌరవం పెరిగింది.
***
గంగ కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. తమ సంఘం సభ్యులంతా ఎంతో సఖ్యంగా, తోడు నీడగా మసలేవాళ్ళు. అలాంటి వాళ్ళే నిన్న తనపట్ల ఎంత పరుషంగా ప్రవర్తించారు. ఆదెమ్మ… భర్త కొడుతుంటే తామంతా ఆదుకున్న ఆదెమ్మ ఎన్నిమాటలంది. ఇదంతా ఎలా జరిగింది.
గంగకి ఆరోజు బాగా జ్ఞాపకం వుంది. తమ సంఘం సమావేశం పూర్తయి, అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుని వున్నపుడు, ఊళ్ళో కుర్రాడొకరు లోపలికొచ్చి,

“గంగ పెద్దమ్మా! నీకోసం ఎవరో వచ్చారు” అని చెప్పి తుర్రుమన్నాడు.
“ఎవరూ” అంటూ బయటకొచ్చి… అపరిచిత వ్యక్తిని చూసి ఆగిపోయింది.
“గంగగారూ! నమస్కారం. నాపేరు రాఘవయ్య. మీతో… అంటే మీ సంఘం సభ్యులతో మాట్లాడాలని వచ్చాను”
రెండు చేతులు జోడించి నిలబడ్డాడు.
ఈ సరికి అందరూ బయటకొచ్చారు. రాఘవయ్య వేపు ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు.
“చెప్పండి! అందరం ఉన్నాం” అంది.
“కూర్చోని మాట్లాడుకుంటే బావుంటుంది కదా”
అందరూ మళ్ళీ లోపలికెళ్ళి కూర్చున్నారు. అందరూ రాఘవయ్య వేపు ఆసక్తిగా చూస్తున్నారు.
“నేను అస్మిత అనే సంస్థ నుంచి వచ్చాను”
“అస్మిత! అదేం సంస్థ” అందరూ అడిగారు.
“చెబుతాను. మా సంస్థ మీలాంటి ఆడవాళ్ళకి రుణాలిస్తుంది. ఆ రుణాలమీద చాలా తక్కువ వడ్డీ వుంటుంది. మీరు మా దగ్గర అప్పు తీసుకుంటే మేము బీమా కూడా చేయిస్తాం.”
అప్పులిస్తాము అనగానే అక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరిలో చాలా ఆసక్తి కలిగింది.
“అప్పు ఎలా ఇస్తారు? దేనిమీద ఇస్తారు?” గంగ అడిగింది.
“ఏమీ పూచీకత్తు అవసరం లేదు. మీ సంఘ సభ్యులే ఒకరికొకరు పూచీకత్తు. అంతేకాదు ఒకరు తీసుకున్న అప్పు తీరకుండానే మళ్ళీ రుణం తీసుకోవచ్చు”.

ఆడవాళ్ళంతా నమ్మలేనట్లు చూసారు. తమ సంఘంలో అయితే తీసుకున్న అప్పు మొత్తం తీరేదాక మరో అప్పు ఇవ్వరు. ఇదేదో బావుందే. అనుకున్నారు.
రాఘవయ్య వివరంగా చెప్పాడు. అందరూ రకరకాల ప్రశ్నలు వేసారు. అన్నింటికీ సమాధానాలు చెప్పాడు.

***
వారం తిరక్కుండానే కనకదుర్గమ్మ సంఘం స్త్రీలు అస్మిత సంస్థ దగ్గర అప్పు తీసుకున్నారు. ఈ అప్పు వారం వారం కట్టాలని రాఘవయ్య చెప్పాడు. కడతామని అందరూ ఒప్పుకున్నారు. తీసుకున్న అప్పుసొమ్ము వ్యాపారాల్లో కొందరు మదుపు పెడితే, కొందరు ఇంట్లో ఇబ్బందులకు వాడేసుకున్నారు.

  పదిహేను రోజుల తర్వాత ‘ ఉండమ్మా! బొట్టుపెడతా’ పేరుతో మరో సంస్థ గ్రామంలోకి దిగింది. వాళ్ళిచ్చిన రుణాలు తీసుకున్నారు. వారం వారం కిస్తులు కట్టడం మొదలు పెట్టారు. మొదట్లో బాగానే కట్టేయగలిగేరు. అప్పు మీద అప్పు పుట్టడంతో వాళ్ళకేమీ ఇబ్బంది కల్గలేదు. వారంలో శుక్రవారం అస్మిత అప్పుకి కిస్తు, బుధవారం ఉండమ్మా బొట్టుపెడతా అప్పు, సోమవారం ‘షేర్’ అప్పుకి కిస్తు కట్టడం.
 
***
గంగ మరో గేదెను కొంది. కొంత సొమ్ము ఖర్చుపెట్టి ఇల్లు బాగుచేయించింది. రెండు గేదెలు పుష్కలంగా పాలు ఇవ్వడంతో వారం వారం అప్పులకు వాయిదాలు కట్టడంతో మొదట్లో కష్టమేమీ అన్పించలేదు. అయితే ఊళ్ళో ఆడవాళ్ళ ప్రవర్తనలో మాత్రం విపరీతమైన మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఎవరో ఒకళ్ళింట్లో సమావేశ మయ్యేవాళ్ళు. ఎన్నో విషయాలు మాట్లాడు కునేవాళ్ళు. ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటూ , ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే అందరూ కలిసి దానిని పరిష్కారం చేయడానికి పూనుకునేవాళ్ళు. ముఖ్యంగా, సరదాగా నవ్వుకుంటూ, ఎకసెక్కాలు, వేళాకోళాలు ఆడుకుంటూ కలిసి మెలిసి వుండేవాళ్ళు.

అలాంటిది మైక్రోఫైనాన్స్ వాళ్ళు ఏరోజు ఆ ఊళ్ళో అడుగుపెట్టారో, అప్పు మీద అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం మొదలెట్టారో, ఊళ్ళోని ఆడవాళ్ళకి వేరే ప్రపంచం లేకుండా పోయింది. మీటింగుల్లేవు. సరదా ముచ్చట్లు లేవు. తెల్లారితే ఎవరి బకాయి కట్టాలి? కిస్తు సొమ్ము ఎలా సమకూర్చుకోవాలి? కట్టకపోతే ఎదురయ్యే అవమానాల్ని ఎలా ఎదుర్కోవాలి? ఇవే ఆలోచనలు. మైక్రో ఫైనాన్స్ కంపెనీల వాళ్ళు వాళ్ళ కిస్తు వసూళ్ళకోసం ఈ ఆడవాళ్ళని ఒకరిమీదికి మరొకరిని ఉసిగొల్పి తమ పబ్బం గడుపుకోవటం మొదలెట్టారు. శుక్రవారం అస్మిత వాళ్ళ అప్పు కట్టాలి. గ్రూపులో అందరూ కిస్తు చెల్లించేవరకు ఎవరూ కూర్చున్న చోటునుంచి కదలకూడదు, కూలికెళ్ళకూడదు. ఎవరైనా కట్టలేకపోతే గ్రూపులోని ఏ ఒక్కరూ అక్కడినుండి కదలడానికి లేదు. సాయంత్రం వరకు కూర్చోవలసిందే. సాయంత్రానికి కూడా ఎవరైనా కట్టలేకపోతే వాళ్ళ పరిస్థితి అధ్వాన్నంగా తయారౌతుంది. ఉదయం నించి పనులన్నీ మానుకుని కూర్చున్న వాళ్ళంతా అసహనంతో, కోపంతో కట్టనివాళ్ళమీద విరుచుకుపడతారు. నోరు నొప్పెట్టేవరకు తిడతారు. అప్పులిచ్చిన వాళ్ళు చిద్విలాసంగా కూర్చుని ఈ అమానవీయ దృశ్యాల్ని చూస్తూ, వాళ్ళని మరింత రెచ్చగొడతారు. దీంతో గ్రామంలోని ఆడవాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేయబడ్డారు. సరదాగా, సరస సల్లాపాలతో చెమత్కారా లాడుకునే ఆడవాళ్ళు బద్ధ శతృవుల్లా తయారయ్యారు. వారం వారం కట్టాల్సిన అప్పు కిస్తులు తప్ప వాళ్ళ మనసుల్లో వేరే ఆలోచన లేకుండా పోయింది. నిద్రలో కూడా అవే కలలు. పీడ కలలు పీడించడంతో, నిద్రలేక, తిండి తినలేక రకరకాల రోగాలు మొదలయ్యాయి. డబ్బు కట్టాల్సిన రోజు వస్తోందంటే గుండెల్లో దడ, వణుకు. అవమానాన్ని ఎలా తట్టుకోవాలనే బెంగ. ఆ ఊరి ఆడవాళ్ళందరి పరిస్థితి అలాగే వుంది. ఎవరితో చెప్పుకోలేరు. కష్టాన్ని వినే మనిషే లేకుండా అయ్యారు. అందరికి అప్పుల కష్టాలే.

***
గంగకి క్రితం రోజు సాయంత్రం జరిగిన విషయాలు గుర్తొచ్చాయి. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. తన దురదృష్టం కాకపోతే తన గేదె ఎందుకు చచ్చిపోవాలి. మాయదారి పాము కాటేయ్యకపోతే, తన గేదె ఎందుకు చచ్చిపోతుంది. గేదె పోయింతర్వాత తను అప్పు కట్టలేకపోయింది. మూడు వారాల్నించి ఎవరికి కట్టలేక నానా తిట్లూ తింటోంది. తానే కాదు నిన్న చాలామంది కట్టలేదు. ఒకరినొకరు కాట్లకుక్కల్లా తిట్టుకున్నారు. ఆదెమ్మ రెచ్చిపోయి మీదిమీదికొచ్చింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. అస్మిత వాడు మాత్రం కుర్చీలో కాలుమీద కాలేసుకుని కూర్చుని వీళ్ళని ఎంత రెచ్చగొట్టాలో అంతా రెచ్చగొట్టాడు. వచ్చేవారం మొత్తం కట్టకపోతే కుదరదని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు లేచి, ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు ముఖాలు వేలాడేసుకుని, జీవంలేని వాళ్ళల్లా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. తాను మాత్రం చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. చస్తే పీడ విరగడవు తుందని చాలా సార్లు అనుకుంది. కోడలొచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. పచ్చి మంచినీళ్ళయినా ముట్టకుండా అలాగే నిస్త్రాణంగా పడుకుంది రాత్రంతా.
 
****

పది గంటలవేళ అరుంధతి గంగ వాళ్ళింటికొచ్చింది. ఈమధ్య కాలంలో అరుంధతి పిలిచినా వీళ్ళెవరూ వెళ్ళడం లేదు. మీటింగ్‌ పెట్టినా ఎవరూ హాజరవ్వడం లేదు. ఊళ్ళోకి రాగానే నిన్న రాత్రి జరిగిన గొడవ అరుంధతికి తెలిసి, గంగను చూడ్డానికి వచ్చింది. అరుంధతిని చూసి గంగ వెక్కి వెక్కి గుండెలవిసి పోయేట్టు ఏడ్చింది. తన బతుకిలా కావడానికి అరుంధతే కారణమన్పించింది గంగకి. మాట్లాడకుండా కూర్చుంది. గంగ పరిస్థితి చూసి అరుంధతి చాలా బాధపడింది. ఆమె మనసులో జరుగుతున్న కల్లోలాన్ని అర్థం చేసుకోగలిగింది.

“గంగా! ఊరుకో. జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. ఇలా బాధపడుతున్నది నువ్వొక్కదానివే అనుకోకు. నీకు తెలుసా కృష్ణా జిల్లాలో నీలాంటి ఆడవాళ్ళందరూ తిరగబడి కలెక్టర్‌కి కంప్లయింట్ చేసారు.”

గంగకి అర్థం కానట్టు చూసింది.

“మైక్రో ఫైనాన్స్‌ వాళ్ళు మీ ఊళ్ళోనే కాదు అన్నిచోట్ల అప్పులిస్తున్నారు. కృష్ణాజిల్లాలో ఇంకా ఎక్కువ. ఈ అప్పులు కట్టలేక నలుగురు ఆడవాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు”

“నిజంగానా?” గంగ నమ్మలేక పోయింది కానీ నిన్న తనకీ అన్పించింది చచ్చిపోవాలని.

“అవును గంగా. వసూళ్ళలో వాళ్ళు పాటిస్తున్న ఘోరమైన విధానాలు ఆడవాళ్ళని శతృవులుగా మార్చేసాయి. కొన్ని రోజుల తర్వాత జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు వినతి పత్రం ఇచ్చేవరకు కలెక్టర్‌కి గాని, బయట ప్రపంచానికి గాని మైక్రో ఫైనాన్స్‌ వాళ్ళ ఆగడాలు తెలియలేదు. మా డిపార్ట్‌మెంటు కూడా దీనిమీద ఏదైనా చెయ్యాలని చూస్తోంది. మీరంతా మళ్ళీ కలిస్తేగాని మేము ఏమీ చెయ్యలేం” అరుంధతి అంది.

“మేం మళ్ళీ కలవడమా! నిన్న పోట్లగిత్తలా పోట్లాడుకున్నాం. మా ఆడవాళ్ళకి అప్పులు తిరిగి కట్టడం తప్ప మరో ఆలోచన లేకుండా పోయింది. ఎవ్వరూ రారమ్మా”

“నేను ప్రయత్నిస్తాను. గంగా !ఇదిగో కృష్ణా జిల్లా ఆడవాళ్ళు కలెక్టర్‌కిచ్చిన వినతి పత్రం కాపీ. ఇది చదివితే మీకు అర్థమౌతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్ని నిషేధించారు తెలుసా?”

“అంటే”

“అంటే ఏం లేదు. వీళ్ళు అప్పులివ్వడానికి లేదు. ఇచ్చినా వడ్డీ తగ్గించాలి. కిస్తులు వారానికి కాకుండా నెలకోసారి వసూలు చెయ్యాలి. ఇంకా చాలా విషయాలున్నాయి మీకు చెప్పాల్సినవి. వచ్చేవారం మీటింగ్‌ పెడదాం”

“ఈ విషయాలు మాకు తెలియక పోయేనే! మీటింగా? ఏమో! కష్టం” నసిగింది గంగ. నిన్న తనని అంత అవమానించి, చీదరించిన వాళ్ళతో తనెలా మాట్లాడగలుగు తుంది. తానూ కూడా ఒకసారి కాదు ఎన్నోసార్లు కట్టలేని వాళ్ళని తిట్టిన విషయం గుర్తొచ్చింది గంగకి. తనేమైనా తక్కువ తిట్టిందా? తన రెండు గెదెలు పుష్కలంగా పాలు ఇచ్చినపుడు సక్రమంగా బాకీలు చెల్లించినపుడు తనకీ కళ్ళు నెత్తికెక్కాయి. తనూ తిట్టిపోసింది.

“సరే గంగా! జరిగిందానికి బాధపడకు. ఏం చెయ్యాలో ఆలోచించు. ఈ గ్రామంలో సంఘం మొదలు పెట్టించింది నువ్వే. మీరంతా ఎంతో సరదాగా, పరాచకాలాడు కుంటూ కలిసి మెలిసి వుండేవాళ్ళు.మీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడానికి కారణం మాత్రం మీరు కాదు. ఒకళ్ళ మీదికి ఇంకొకరిని ఉసిగొల్పి తమ పబ్బం గడుపుకుంటున్నవాళ్ళు బాగానే వున్నారు. మీరు ఎందుకు ఇలా అయ్యారో ఆలోచించు. వచ్చేవారం మీటింగ్‌ జరిగేట్టు వుంటే నాకు కబురు చెయ్యి” అని చెప్పి అరుంధతి వెళ్ళిపోయింది.

గంగ అలాగే కూర్చుండిపోయింది. అరుంధతి చెప్పిన విషయాలు ఆమె మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. ఏవో చిక్కుముడులు విడుతున్నట్టుగా అన్పించింది. నిజమే! ఈ అప్పులిచ్చేవాళ్ళు రాకముందు తామంతా ఎంత బాగా వుండేవాళ్ళు. వాళ్ళిచ్చిన అప్పులు తమ బతుకుల్ని ఏమైనా బాగుచేసాయా అంటే అదీ లేదు. అప్పు మీద అప్పు ఎరచూపి, ఎక్కువ వడ్డీలు గుంజి రాబందుల్లా పీక్కు తింటున్నారు. తమలో తమకి పోట్లాటలు పెట్టి కాలుమీద కాలేసుకుని కూర్చున్న రాఘవయ్య గుర్తొచ్చి ఆమెకి కోపం ముంచు కొచ్చింది. దీనికంతటికీ కారణం రాఘవయ్యే! అరుంధతి కాదు, ఆదెమ్మ కాదు అని అర్థమైంది గంగకి. ఆదెమ్మ కూడా ఒకసారి అప్పు కట్టలేక ఎన్ని తిట్లు భరించిందో గుర్తొచ్చింది గంగకి. వెంటనే అరుంధతి ఇచ్చిన కాగితాలన్నీ తీసుకుని ఆదెమ్మ ఇంటివేపు నడిచింది. అప్పటివరకు దైన్యంగా కన్నీళ్ళు కార్చిన గంగ, ధైర్యంగా తలెత్తుకుని వీధుల్లోకి నడవడం గమనించిన ఆమె కోడలు విస్తుపోయి చూస్తూ నిలబడింది.






Thursday, November 3, 2011

మాట్లాడుకోవాలి


ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. మే నెలలో హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణాగ్రత. ఈ రోజు ఇరవై ఆరు. నిన్నటికి ఇవాల్టికి ఎంత తేడా. బంగాళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు లైలా! క్రితం సంవత్సరం వచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంశం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లు ఎందుకు పెడతారో!
మురళి, మాధవి బయట పచ్చటి లాన్‌లో కుర్చీలేసుకుని కూర్చున్నారు.చీకటి పడినట్లయిపోయింది. డాబామీదికి ఎగబాకిన మాలతీలత ఆకు కనబడకుండా విరబూసింది. మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది. ఇంకో పక్క కుండీలో గ్లోబులా పూసిన మే ప్లవర్‌. ఎర్రటి రంగుతో, అద్భుతమైన అల్లికతో చూడముచ్చటగా వుంది. మబ్బుల చాటున ఈద్‌కాచాంద్‌లాగా దర్శనమిచ్చింది నెలవంక.
''బాగా వర్షం వచ్చేట్టుంది మురళీ! లోపలికెళదాం పద'' మాధవి అంది.
''తుఫాను ఎఫెక్ట్‌ బాగానే వున్నట్టుంది. వెళదాంలే బయట చల్లగా, హాయిగా వుంది'' అన్నాడు మురళి
''నిజమే! చాలా హాయిగా వుంది. మనం ఇలా కూర్చుని మాట్లాడుకుని ఎంత కాలమైంది. ఏమిటో బతుకంతా ఉరుకులు, పరుగులతోటే సరిపోతోంది. దేనివెంట పరిగెడుతున్నమో అర్ధం కావడం లేదు'' అంది మాధవి నెలవంకని చూస్తూ.
మురళి కాసేపు మాట్లాడలేదు. మాధవి మనసులోని బాధ అర్ధం అవుతోంది. ఇరవై రెండేళ్ళ కాపురంలో మొదటి మూడు, నాలుగు సంవత్సరాల్లో తప్ప తాము ఇలా ఇంత ఆరామ్‌గా కూర్చున్నది లేదు. కార్పోరేట్‌ కాలేజీలో పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారు చేసే యంత్రంలా తను, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో తలమునకలుగా మాధవి. డబ్బుకేం లోటు లేదు. పిల్లలకి మంచి చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు. ఖరీదైన ఇల్లు, సౌకర్యాలన్నీ వున్నాయి.
''ఏంటీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌ మురళీ.''
''ఏం లేదు మధూ! ఇలాంటి సాయంత్రాల్ని ఎన్నింటిని కోల్పోయామా అన్పిస్తోంది.''
సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఇద్దరూ లాన్‌లోంచి లేచి ఇంట్లో కొచ్చారు. ''కాఫీ తాగుదామా మురళీ''
''ఈ చల్లటి వాతావరణంలో అంతకంటే కావల్సిందేముంది పద కలుపుకుందాం.''
కాఫీ కప్పులతో డైనింగు టేబుల్‌ మీద కూర్చున్నారు. గాలి ఉధృతి పెరిగింది. వాన జోరుగా పడుతోంది. ఎక్కడో పెళ పెళమంటూ పిడిగు పడిన శబ్దం. కరెంటు పోయింది.
''ఎమర్జన్సీ లైట్‌ చెడిపోయింది. కాండిల్‌ ఎక్కడుందో ఏంటో'' అంటూ మాధవి లేవబోయింది.
''ఉండు మధు! కాండిల్‌ వద్దులే.కాసేపు చీకట్లో కూర్చుందాం.''
మాధవి కూర్చుంది. చిమ్మచీకటి. అపుడపుడూ మెరుపులు. దడామని పిడుగులు. వర్షం కురుస్తున్న శబ్దం మాలతీపూల మధుర సువాసనలు. గమ్మత్తుగా హాయిగా ఉంది వాతావరణం. మురళీకి నెల క్రితమే స్ట్రోక్  వచ్చింది  . క్లాసులో పాఠం చెబుతూ పడిపోవడంతో తనని అప్పటికప్పుడు కేర్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం,కాలూ చెయ్యి ఎఫెక్ట్ కావడం   ఒక్కొటొక్కటి గుర్తొచ్చాయి మాధవికి.
''మధు! ఇలా చీకట్లో కూర్చోవడం బావుంది కదూ! మన మనస్సులోకి చూసుకునే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది''.
''నిజమే మురళి! నిదానంగా నిలబడి నీళ్ళుకూడా తాగలేని వేగం, ఒత్తిళ్ళు మన ఆరోగ్యాలను ఎంత ధ్వంసం చేస్తున్నాయో మనకి అర్ధమవ్వడం లేదు. నాకెందుకో ఇరవై సంవత్సరాల క్రితం నాటి విషయాలు ఇపుడు గుర్తొస్తున్నాయి.''
''ఏ విషయాలు మనం కలిసి బతకడం మొదలు పెట్టిన నాటి కష్టాలా? అవన్నీ ఇపుడెందుకులే మధూ''
''ఆ విషయాలు కాదు మురళీ!  నాకు ఇరవై ఏళ్ళ క్రితమే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యింది. ఆ రోజుల్లో, మన దగ్గర డబ్బులేని రోజుల్లో నువ్వు ఎంత కష్టపడి నాకు ఆపరేషన్‌ చేయించావో నాకు గుర్తుకొస్తోంది."
''వద్దు మధూ! వాటిని గుర్తు చెయ్యకు. అయినా నువ్వు నెలరోజులుగా నా కోసం చేసిన సేవ ముందు అదెంతలే. ఏదో డబ్బుల్లేక గాంధీ హాస్పిటల్‌లో...
'మురళీ! ప్లీజ్‌ అలా అనకు! నన్ను మాట్లాడనీ..నీ కోసం నేను చేసిందేమీ లేదు. ఖరీదైన హాస్పిటల్‌, స్పెషల్‌రూమ్‌, నిరంతరం నర్సు సేవ చేసారు. నేను హాయిగా ఎ.సి రూంలో వున్నాను. కానీ గాంధీలో నేను ధోరాసిక్‌ వార్డులో వుంటే నువ్వెక్కడ వుండేవాడివో నాకు తెలుసు. భయంకర దుర్వాసనలు వెదజల్లే బాత్‌రూమ్‌ల పక్కన, జనరల్‌ వార్డుల పక్కన, రోడ్డు మీద గంటల తరబడి కూర్చోవడం, రాత్రిళ్ళు అక్కడే పడుకోవడం. నాకు తెలుసు మురళీ. గవర్నమెంట్‌ ఆసుపత్రిలో నా గుండె ఆపరేషన్‌ విజయవంతమౌతుందా లేదా అనే టెన్షన్‌, పెద్దలకి ఇష్టంలేని పెళ్ళి చేసుకున్నాం కాబట్టి అటునుంచి సహాయ నిరాకరణ. ఆ రోజుల్లో నువ్వెంత మానసిక క్షోభని అనుభవించి వుంటావో నాకు తెలుసు.నన్ను ఆపరేషన్‌ ధియేటర్‌కి పంపుతూ నువ్వు కార్చిన కన్నీటి చుక్క నా బుగ్గ మీద పడి, అప్పటికే సగం మత్తులో వున్న నాకు వెచ్చగా తాకి, నేను కళ్ళు విప్పి నవ్వుతూ చెయ్యి ఊపుతుంటే నువ్వు కన్నీళ్ళ మధ్య నవ్వావ్‌. అంతే. రెండో రోజు దాకా నాకు స్పృహ రాలేదు. ఆ పగలు, ఆ రాత్రి నువ్వెంత ఏడ్చి వుంటావో నాకు తెలుసు. ఆ తర్వాత నన్నెంత అపురూపంగా చూసుకున్నావో, ఎన్ని సేవలు చేసావో నా మనసుకు తెలుసు. ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని ఎన్నో సార్లు అనుకునేదాన్ని. చెప్పలేదు. వెలుతురులో ఇగోలు, అహాలు అడ్డొస్తాయి కాబోలు. చీకట్లో మనలోకి మనం చూసుకోగలగుతాం.'' మాధవి మాట్లాడడం ఆపింది.
''మధూ! ఇరవై సంవత్సరాలైనా నువ్వింకా ఆ విషయాలు మర్చిపోలేదా? నిజమే! నా జీవితంలో కష్టమైన కాలమది. నా స్థానంలో ఎవరున్నా అంతే చేస్తారు. నీకు గుండెలో పెద్ద రంధ్రముందని మొదటిసారి డాక్టరు చెప్పినపుడు నేను బిత్తర పోయాను. ఆ తత్తరపాటును ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్ధం కాలేదు. మనమున్న స్థితిలో ఖరీదైన వైద్యం చేయించలేను. అయినా అప్పటికి అపొలోలు, కేర్‌లు ఎక్కడున్నాయ్‌? గాంధీ యే దిక్కు. అయితేనేం డాక్టర్లందరూ ఎంతో మంచివాళ్ళు. ఇప్పటిలా కమర్షియల్‌ ఆలోచనలు వున్న వాళ్ళు కాదు.''
''అవును. నేను కళ్ళు తెరిచేటప్పటికీ నా ఎదురుగా కూర్చుని వున్నారు. డా. సత్యనారాయణగారు. రికవరీ రూమ్‌లో ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. అంత ప్రత్యేక శ్రద్ధతో చూడడంవల్లే నేను బతికి పోయాననుకుంటాను.''

''మధూ! ఆ విషయం సరే! నేను కూడా నీకు చాలా దు:ఖం కల్గించాను. బతుకు బండి వంద మైళ్ళ వేగంతో పరుగెతున్నపుడు ఏమీ అర్ధం కాలేదు. నేను నా ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకున్నాను. శరీరాన్ని మిస్‌ యూజ్‌ చేసాను. నా జ్ఞానాన్ని లక్షలకి అమ్మి, యంత్రాల్ని, యంత్రాల్లాంటి విద్యార్ధుల్ని తయారు చేసాను. ఎక్కడ ఎక్కువిస్తే అక్కడికి జంప్‌ చేసి డబ్బు సంపాదనే ముఖ్యమైన ప్రాధాన్యత అనుకున్నాను. సంపాదించిన డబ్బుని ఆస్తులుగానో, వస్తువులుగానో మార్చాను. బ్లాక్‌ లేబుల్‌, రెడ్‌లేబుల్‌ అంటూ బాటిళ్ళకి బాటళ్ళు గొంతులో పోసి గుండెను ఛిద్రం చేసుకున్నాను. నీ మాట ఏనాడైనా విన్నానా? నీకసలు దొరికేవాడినా? నిన్ను చాలా హింస పెట్టాను కదా! డబ్బుతో పాటు బోలెడన్ని రోగాలూ సంపాదించాను. ఆ రోజు  క్లాసులో కుప్పకూలేవరకూ నేను ఏంచేస్తున్నానో ఎలా బతుకుతున్నాననే స్పృహే లేదు. ఆయాంసారీ! మధూ!'' మురళి గొంతు పూడుకుపోయింది.
మాధవి కుర్చీలోంచి లేచి వచ్చి మురళి వెనుక నిలబడింది. అతన్ని గుండెకి పొదుపుకుంటూ...
''మన మధ్య సారీలేంటి మురళీ! నాకు నీ ఆరోగ్యం గురించి చాలా బెంగగా వుండేది. నీ లైఫ్‌స్టయిల్‌ దిగులు పుట్టించేది. డబ్బు వెంట ఎందుకంత వెర్రిగా పరుగెడుతున్నావో అర్ధమయ్యేది కాదు. ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్ళినపుడల్లా నాకు చాలా బాధగా అన్పించేది.''
''నిజమే! బహుశ మన మొదటి రోజుల్లోని కష్టాలే నన్ను అలా పరుగెత్తించాయేమో!ఏమో!''
పెద్దగా ఉరిమింది. కళ్ళు మిరుమిట్లుగొల్పే మెరుపులు. ఫెళ ఫెళమంటూ ఎక్కడో పడిన పిడుగులు.
''ఇంక కరెంటు రాదేమో! కొవ్వొత్తి ఎక్కడుందో'' ''ఉండనీయ్‌లే మధూ! ఇపుడు కరెంట్‌తో మనకి పనేం లేదుగా. డిన్నర్‌ టైమ్‌కి చూద్దాంలే.''
''అంతేనంటావా. ఇలా చీకట్లో కూర్చుని మాట్లాడుకోవడం బావుంది. పండువెన్నెల పరవశాన్ని కల్గిస్తుంది. చీకటి చిక్కదనం కూడా ఇంత బావుంటుందనుకోలేదు.''
''బహుశా మనం చీకటిని వెలుతురును ఒకేలా చూసే దశకి చేరామేమో!''
''అంతే కాదు మురళి! ఇంతకాలం మనం దేనికో దానికి పోట్లాడుకుంటూనే గడిపాం. అది నీ ఉద్యోగమా! పిల్లల విషయమా! నేను చేసే పొరపాట్లా. సాధింపులా? ఏదైనా కానీ ఇలా కూర్చుని సావకాశంగా మాట్లాడుకున్నది లేదు. చర్చించుకున్నది లేదు. ఆవేశాలు, కావేశాలు అంతే. ఇపుడు మనమిద్దరమే మిగిలాం. పిల్లలు అమెరికా నుంచి తిరిగి వస్తారని నాకయితే నమ్మకం లేదు. నాకు నువ్వు నీకు నేను అంతే.'' మురళి జట్టులోకి వేళ్ళు పోనిస్తూ అంది.
''అవును మధూ! ఇంతకాలం ఎవరికోసమో బతికినట్టుంది. ఉద్యోగం కోసం, సంపాదన కోసం, పిల్లలకోసం పరుగులు పెడుతూ బతికాం. అదీ అవసరమే కానీ నేను మరీ విపరీతంగా ప్రవర్తించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. అలా చేసి ఉండకూడు కదా!''
''జరిగిపోయినవి తలుచుకుని బాధపడ్డం ఎందుకులే మురళీ! ఇపుడేం మించిపోలేదు. మనం కలిసి బతకడం మొదలుపెట్టినపుడు ఎంత స్నేహంగా, సంతోషంగా వున్నామో మనిద్దరికీ తెలుసు. మధ్యలో వచ్చిన వేవీ మనకి సంతోషాన్నివ్వలేదు. మన మధ్య కనబడని అగాధాన్ని సృస్టించాయి. ఈ రోజు ఎంతో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకోగలిగాం. ఇది ఇలాగే కొనసాగితే ఇంతకు మించింది ఏముంటుంది?''
''రోజూ లైట్లాపేసి చీకట్లో ఓ గంట గడిపితే బావుండేట్టుంది.'' అన్నాడు మురళి నవ్వుతూ
''నువ్వు ట్లాబ్లెట్లు వేసుకోవాలి. కొవ్వొత్తి కోసం వెతకాల్సిందే.'' అంటూ మధు లేవబోయింది.
అదే క్షణంలో కరెంటు వచ్చింది.
వెంటనే ఫోన్‌ కూడా మోగింది. మాధవి లేచి ఫోనందుకుంది. కూతురు శ్రావ్య. ఫోన్‌ మురళికిచ్చి టాబ్లెట్‌ కోసం వెళ్ళింది మాధవి.
''బావున్నానురా! ఏంచేస్తున్నామా? జోరుగా వాన పడుతోంది. అమ్మ నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. నిజం రా. నమ్మకం కలగడం లేదా? అయితే అమ్మనడుగు'' మాధవికిచ్చాడు ఫోన్‌.
'తల్లీ! నాన్న చెప్పింది నిజమేనే. చాలా సంవత్సరాల తర్వాత మేం బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. నాన్న బాగానే వున్నాడు. మా గురించి మీరేం కంగారుపడకండి. సరేనా'' ఫోన్‌ పెట్టేసింది.
మళ్ళీ ఇద్దరూ కబుర్లలో పడ్డారు. గడ్డ కట్టిన మాటల మూటలేవో కరిగి వర్షం నీరులా ప్రవహించసాగాయి. ఆ ప్రవాహంలో తడిసి ముద్దవుతూ మరిన్ని మాటల్ని వెదజల్లుకుంటూ అలాగే కూర్చుండి పోయారు మురళి, మాధవి.

హం చలేంగే సాత్ సాత్



చుట్టూ అనంత జలరాశి. నౌక నడుస్తున్న శబ్దంతప్ప మహా నిశ్శబ్దం అలుముకుని వుంది. పున్నమి రేయి. వెండి వెన్నెల బంగాళాఖాతం మీద తెల్లటి కాంతుల్ని పరుస్తోంది. అంత వెన్నెల్లోను ఆకాశం నిండా చుక్కలు.
అవని తదేకంగా మెరుస్తున్న నీళ్ళకేసి చూస్తోంది.
''ఏంటి అంత దీక్షగా చూస్తున్నావ్‌?''
''ఈ రాత్రి ఎంత అందంగా వుంది. మెరుస్తున్న నీళ్ళలోకి దూకాలన్పిస్తోందోయ్‌.''
''అదేం పిచ్చి కోరిక''
''ఇవాళెందుకో పిచ్చి కోరికలు కలుగుతున్నాయ్‌''
''అవనీ''
''ఊ... చెప్పు''
''ఇంకేం కోరికలు కలుగుతున్నాయేం'' అన్నాడు ఆమెని ఆనుకుంటూ.
'' ఈ నిశ్శబ్దపు రేయి, ఈ పండు వెన్నెల, చుట్టూ అపార జలాలు, ఎగిసిపడుతున్న కెరటాలు...''
''అబ్బ! ఏంటోయ్‌ కవిత్వం చెబుతున్నావ్‌?''
''కవిత్వం కాదోయ్‌ గురూ! ప్రకృతి ప్రేమ''
''నామీద ప్రేమ కలగడం లేదా?''
''అదేం పిచ్చి ప్రశ్న. నీ మీద ప్రేమ ఇపుడు కొత్తగా కలగడమేమిటి? ప్రేమ లేకుండానే నీతో ఇలా వచ్చానా? నిన్ను పెళ్ళిచేసుకున్నానా?''
''మరి నా మీద ప్రేమ వ్యక్తం చెయ్యవేం''
''నా మనస్సంతా నీ ప్రేమతో పొంగిపొర్లుతుండడం వల్లనే కదా! ప్రకృతి అంత రమణీయంగా వుంది.''
''ప్రేమలేని వాళ్ళకి ప్రకృతి అందంగా కనబడదా?''
''ఆ విషయం నాకు తెలియదు గానీ నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి?''
''ప్రేమంటే... ఐ లవ్‌ యూ అని చెప్పడమే కదా''.
''అంతేనా''
''నువ్వు అందంగా వుంటావ్‌. అందుకేగా నిన్ను ప్రేమించాను''
''అందంగా వున్నందుకే నన్ను ప్రేమించావా?''
''అంతే కదా! అది వేరే చెప్పాలా? ఈ కళ్ళిష్టం ఈ పెదవులిష్టం. ఈ ముక్కు ఇష్టం. తెల్లగా మెరుస్తున్న ఈ శరీరమంతా ఇష్టం నాకు.''
''ఇంకా... ఇంకేమిష్టం''
''నీలో వున్నవన్నీ నా కిష్టమే''
''నాలో వున్నవన్నీ అంటే...''
''చెప్పాను కదోయ్‌. ఎన్ని సార్లు చెప్పించుకుంటావ్‌?''
''ఇంకా ఏదో మిగిలి పోయిందని పిస్తోంది. నా శరీరంలోని అవయవాలన్నీ ఇష్టమని చెప్పావ్‌ గానీ, నా మనసు, ఆలోచనలు, ఆశ యాలు వీటి గురించి ఏమీ మాట్లాడలేదే!
''నీ మనస్సు నాదేగా! నా మీద కాక నీకు వేరే ఆలో చనలు, ఆశలు ఏముంటాయ్‌?''
''నా మనస్సు నీదెలా అవుతంది గురూ''
''అదేంటి?''
''ఎందుకలా ఆశ్చర్యపోతావ్‌. నా మనస్సు నాదే. నీ మనస్సు నీదే. నా ఆలోచనలు, ఆశయాలు నావే. నీవెలా అవుతాయోయ్‌.''
''ఒకరి హృదయాన్ని ఇంకొకరం ఇచ్చిపుచ్చుకోవడమేగా ప్రేమంటే''
''నా ఉద్దేశ్యంలో ప్రేమంటే అది కాదు. మనస్సును ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఒకరికి ఇంకొకరం ఫోటో స్టాట్‌ కాపీలంగా మారడం కాదు''.
''మరి''
''అరె. చూడు చూడు ఆకాశం నుంచి తెగిపడిన చుక్క మనవేపే వస్తోంది''. దోసిళ్ళు పట్టింది.
''ఏదీ చూడనీయ్‌'' అంటూ అవని దోసిల్లోకి వంగాడు. తన దోసిట్లో ముఖాన్నుంచిన గురూని గుండెకి హత్తుకుంది అవని.
''లెటజ్‌ ఎంజాయ్‌ దిస్‌ వండర్‌ఫుల్‌ నైట్‌''.
''ఎంజాయ్‌ చేస్తున్నాంగా. ఇంతకంటే ఏం కావాలి?''
''చాలా చాలా కావాలన్పిస్తోంది. నువ్వేమో కబుర్లు మాత్రమే చెబుతున్నావ్‌''.
''కబుర్లు చెప్పొద్దంటే మానేస్తా. ఇంతటి హాయైనవేళ మనిద్దరికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోక పోతే ఎలాగోయ్‌''
''ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావ్‌. అసలు సంగతిలోకి రావేంటి?''
''అసలు సంగతా ఏంటది?''
''నీకు తెలియదా? ఆకాశపందిరి కింద, చుక్కల తోరణాల మధ్య, లక్ష నియోన్‌ లైట్లకి సమానంగా వెల్గుతున్న చంద్రుడి సాక్షిగా....''
''వాహ్‌! క్యాగజల్‌ హై.... చెప్పు.... చెప్పు''.
''నిన్నిపుడు ముద్దుపెట్టుకోవాల నుంది''.
''పెట్టుకో. నాకూ నిన్ను ముద్దు పెట్టుకోవాలన్పిస్తోంది.''
గురూని దగ్గరికి లాక్కుని గాఢంగా ముద్దుపెట్టింది. కెరటాల సంగీతంలో వాళ్ళిద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలగలిసి పోయాయి. చంద్రుడు ఓ క్షణం సేపు మబ్బుల్లో దాక్కున్నాడు.
'గురూ'
''ఊ... ఇపుడేమీ మాట్లాడకు''
''నాకు చాలా చాలా మాట్లాడాల న్పిస్తోంది''
గురు వెల్లికిలా పడుకుని ఆకాశంకేసి చూస్తున్నాడు.
అవని అతని గుండెమీద తలానించి తనూ వెల్లికిలా పడుకుంది.
''మనం తొందరలోనే మన సహజీవ నం మొదలెట్టబోతున్నాం. దాని గురించి ప్లాన్‌ చేద్దామా గురూ!''
''దాంట్లో అంత ప్లానింగు అవసరమేముంది, అందరూ చేస్తున్నదేగా?''
''మనం భిన్నంగా ప్లాన్‌ చేద్దామోయ్‌. ఇంతకు ముందుకూడా మాట్లాడుకున్నాం కదా!''
''అవనీ! ప్లీజ్‌ ఇంత చక్కనివేళ సంసారం గోలా''
''సంసారం గోలా? అదేంటి గురూ! అంత మాటన్నావ్‌?''
''నా ఉద్దేశ్యం అది కాదు అవనీ''
''మా నాన్న సంసారం సాగరం అనేవాడు. మా అన్న మా వదినతో నీతో సంసారం నరకం అనేవాడు. ఈ సాగరాలు, నరకాలు చూసి భయపడే నేను పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను. నువ్వు కూడా.....''
''ఛ.... ఛ.... అదికాదు, ఇంత రమ్యమైన చోట ఎంజాయ్‌ చెయ్యకుండా అవన్నీ ఇపుడే మాట్లాడుకోవాలా? అనే నా ఉద్దేశ్యం, అంతేనోయ్‌.''
''మన సహజీవనానికి సంబంధించిన విషయాలేగా ఇవి కూడా.మనం తల్చుకుంటే ప్రతిరోజు రమ్యంగానే ఉంచుకోవచ్చు''.
''నిజమే. అవనీ! అవన్నీ మాట్లాడు కుంటేనే బావుంటుంది. అయామ్‌ సారీ''
''సారీలెందుకు లేవోయ్‌. అది సరే గాని. మన పురోహితులు చదివే మంత్రాలు నీకేమైనా అర్థమయ్యాయా?''
''వాటె జోక్‌ యార్‌. అవన్నీ సంస్కృతం. మనకు తెలుగే సరిగ్గా రాదు.'' గట్టిగా నవ్వాడు.
''కదా! మరెందుకవన్నీ చదువుతారో నాకూ అర్థంకాదు. ఆ మంత్రాల సంగతి వదిలేద్దాం గానీ నీ లైఫ్‌ పార్టనర్‌గా నానుంచి ఏమాశిస్తున్నావ్‌?''
''నాకిష్టమైనట్టు నువ్వుండడం''
''నీకేమిష్టమసలు?''
''నన్ను ప్రేమించాలి. నాకేది నచ్చుతుందో నీకూ అదేనచ్చితే బావుంటుంది నాకు''.
''అదెలా. నీకు బంగాళాదుంపంటే బోలెడిష్టం. నాకు అది పడదు. నాకు కాకరకాయ ఇష్టం. నీకు ఎక్కదు''.
''అబ్బ! అదో పెద్ద సమస్యా ఏంటి?''
''ఉదాహరణ చెప్పాను లేవోయ్‌''
''నువ్వెప్పుడూ నాతోనే వుండాలన్పిస్తుంది''
''ఇరవై నాలుగ్గంటలూ నీతోనే వుంటే నా ఉద్యోగం, నాఫ్రెండ్స్‌, నా స్పేస్‌ ఏమవ్వాలి?''
''అంటే నీకు నాతో వుండడం బావుండదా?''
''దివ్యంగా వుంటుంది. అలాగని నాకు వేరే ప్రపంచం లేకుండా పోదుగా''.
''ఎందుకుండదు? ఎవరి ప్రపంచం వాళ్ళకుండాల్సిందే. సరే నానుంచి నువ్వేం ఆశిస్తున్నావో చెప్పవా మరి''
''చెబితే కోపమొస్తుందేమో నీకు''
''కోపమెందుకు చెప్పు. నువ్వేం చెప్పినా వినడానికి రెడీ''
''మీ అమ్మలాగా, మా అమ్మలాగా వుండాలని నాకు లేదు''.
''అంటే...''
''నాకు కొన్ని ఆశలు, అభిరుచులు వున్నాయి. నీకు నచ్చకపోతే వాటిని నేనెందుకు వదిలేసుకోవాలి? పెళ్ళయితే ఆడవాళ్లు అన్ని అభిరుచులూ వదలిలేసు కోవాలని మనవాళ్లు బోధిస్తారు కదా!''
''నేను నిన్ను ఏమీ మానేయమనలేదే. నీ ఇష్టం నీది. నేనెందుకు అడ్డుకుంటాను''.
''నువ్వడ్డుకున్నా నేను లెక్కచేయను అని ఈరోజు నీతో చెప్పాలనుకుంటున్నాను. నన్ను కేవలం ఓ ఆడదానిగా కాక మనిషిగా. నీలాగే రక్తమాంసాలు, ఆత్మగౌరవం వున్న తోటి మనిషిగా అంగీకరించి, అర్థం చేసు కోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందు కంటే నేను చూసిన సంసారాల్లో మగవాళ్ళు ఎంతెంత అహంకారంతో ప్రవర్తిస్తారో చాలా మందిని చూసాను. నువ్వలా ప్రవర్తించిన మరుక్షణం నీకూ నాకూ ఏమీ మిగలదు''.
''అలా మాట్లాడకు అవనీ. పెద్దవాళ్ళు మన సంప్రదాయం ప్రకారమే కదా మనకు చెబుతారు''
''అంటే అవన్నీ నీకు ఆమోదమేనా?''
''నా ఇష్టాయిష్టాలతో ఏమవుతుంది? మనం వీటికి వ్యతిరేకంగా వెళితే మన అమ్మలూరుకోరు కదా!''
 ''నాకు నీ సంగతి కావాలి?''
''వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా!''
''తప్పకుండా వినాలి. కానీ మన వ్యక్తిత్వానికి, జీవన విధానానికి సంబంధించిన నిర్ణయాలు మనమేగా చేసుకోవాలి. మన అమ్మల జీవన విధానానికి, మన జీవన విధానానికి చాలా తేడా వుంది. ఒప్పుకుంటావ్‌ కదా!''
''ఎందుకు ఒప్పుకోను? నువ్వు నాలాగే ఇంజనీరింగు చదివావ్‌. నా స్థాయి ఉద్యోగం చేస్తున్నావ్‌. అందుకే కదా ఇంత లెక్చరిస్తున్నావ్‌. పండు వెన్నెల్ని బంగాళా ఖాతం పాలు చేస్తున్నావ్‌''.
''లెక్చరిస్తున్నానంటావా? వెన్నెల మనమీదేగా కురుస్తోంది. ఇపుడు మనకొచ్చిన లోటేమిటోయ్‌''
''లోటు కాదా మరి. పిల్లలొద్దంటూ కండిషన్లు పెట్టడం''
''ఇపుడే పిల్లలొద్దని ముందే అనుకున్నాం కదా!''
''ఏమో! పిల్లలొద్దనుకున్నాం గానీ ఇలాగా.... మా అమ్మకి ఇంకా చెప్పలేదు''.
''ఏ విషయం...''
''పిల్లల విషయం''
''ఇది మన స్వంత విషయం. మనిద్దరి వెసులుబాటుకి సంబంధించింది. వాళ్ళకు చెబుతాం గానీ వాళ్ళ ఆమోదం కోసం మాత్రం కాదు కదా!''
''మా అమ్మ చాలా బాధపడు తుంది''
''అయితే నా కెరీర్‌ విషయం నీకు బాధకల్గించదా?''
''అదేం మాట. పెద్దవాళ్ళ బాధపడతా రంటున్నాను అంతే''
''మనకు ఖచ్చితమైన అభిప్రాయం వుంటే వాళ్ళకి సర్దిచెప్పడం కష్టం కాదు.
''నువ్వన్నది నిజమే. సాధారణంగా మగవాళ్ళ, నాతో సహ ఏదీ మీదేసుకోకుండా పెద్దవాళ్ళ మీద తోసేస్తారు. కొత్తగా ఆలోచించడానికి బద్ధకం. అమ్మల వెనక దాక్కుంటే సరిపోతుందనుకుంటాం''.
''గురూ! మనం కొత్తదారిలో నడుద్దాం. అలాగని పెద్దవాళ్ళని అస్సలు పట్టించుకోవద్దని కాదు. చూడు చూడు మళ్ళీ తెగిన నక్షత్రం మనవేపే వస్తోంది. దోసిళ్లు పట్టు''.
''నక్షత్ర శకలాలు మెరుస్తూ... నీకోసమే చూడు ''దోసిలి అవని ముఖానికి దగ్గరగా తెచ్చాడు''. నీ కోసం ఓ పాట పాడతా వింటావా?''
''వింటావా? ఏంటోయ్‌. నీపాట వినేకదా నీ ప్రేమలో పడ్డాను''.
''అవును కదా! మన కల్చరల్‌ ప్రోగ్రామ్‌ జిందాబాద్‌''
''ఈ నిశ్శబ్దంలో, పండు వెన్నెల్లో నీ పాట వినడం గొప్ప అనుభూతోయ్‌'' అంది అవని గురుని చుట్టేస్తూ.
''అవనీ! మర్చిపోయాను. మా అమ్మ ఏమందో తెలుసా?''
''ఏ విషయం''.
''నేను నా ఫ్లాట్‌ అద్దె కిచ్చే విషయం. నువ్వేంటిరా ఆవనింటికి వెళ్ళడం. అవనియే మనింటికి రావాలి అంది. నేను అమ్మకి అంత వివరించి చెప్పానులే. మనిద్దరం ఎందుకలా నిర్ణయించుకున్నామో కూడా చెప్పాను, ఒ.కే అంది''
''యు ఆర్‌ ఏ గుడ్‌ గై. మనం స్పష్టంగా, దృఢంగా చెపితే తప్పక అర్థం చేసుకుంటారు. మా అమ్మకూడా ముందు గొడవ చేసింది కదా! మన పెళ్ళి విషయంలో''.
''ఆ విషయం ఎలా మర్చిపోతాను. కులాలు వేరని, ప్రాంతాలు వేరని అమ్మో! ఎన్ని గొడవలు చేసారు''.
''అన్నీ దాటేసాంలే. వెన్నెలవేళ సంసారం ముచ్చట్లు విసుగొచ్చాయి కదూ''
''అలా ఏంలేదు. నిజానికి మన జనరేషన్‌ కపుల్స్‌ ఇవన్నీ తప్పని సరిగా మాట్లాడుకోవాలి. మనం అమ్మ నాన్నల్లాగా ఉండలేం కదా! మన సమస్యలు, సవాళ్ళు వేరు. మనకు టైమ్‌ దొరకడమే కష్టం. ఇప్పుడు మాట్లాడుకోవడం, మనస్సులు విప్పుకోవడం అవసరం''
''గురూ! మనం కొత్తతరం ప్రతినిధులం. మన జీవనశైలి మరింత కొత్తగా, మనకు అనుగుణంగా మనమే మలుచుకోవాలి. పోర్ట్‌బ్లెయిర్‌ కనిపిస్తోంది''.
''అవును. మనం మరో అరగంటలో పోర్ట్‌బ్లెయిర్‌ వెళ్ళిపోతాం''
ఇద్దరూ డెక్‌ మీంచి కిందికి దిగు తుండగానే నౌక పోర్ట్‌బ్లెయిర్‌లో ఆగింది.
 ??????
రెండేళ్ళ తర్వాత
???
''గురూ! మనం రెండేళ్ళ క్రితం అండమాన్‌ అఖండ జలరాశి మీద, పండు వెన్నెల్లో ఎన్నో బాసలు చేసుకున్నాం. ఇప్పుడు ఈ కాశ్మీర మంచు శిఖరాల మీద మళ్ళీ వాటిని మననం చేసుకుంటున్నాం''.
కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో విపరీతంగా మంచు కురుస్తున్న వేళ ఓ హోటల్‌ రూమ్‌లోంచి కురుస్తున్న మంచును చూస్తూ నిలబడి వున్నారు. రూమ్‌లో హీటర్‌ వున్నా విపరీతంగా చలిగా వుంది. ఒకరి వొంటి వెచ్చదనాన్ని మరొకరు ఆస్వాదిస్తూ రెండేళ్ళ నాటి కబుర్లను తవ్విపోసుకుంటున్నారు.
''అవనీ! నిజం చెప్పనా? ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే చాలా విసుగొచ్చింది నాకు. హాయిగా హానీమూన్‌ కొచ్చి ఎంజాయ్‌ చెయ్యకుండా ఈ కబుర్లేమిటిరా అని కూడా అనుకున్నాను.
''విసుగొచ్చిందన్నమాట. బాగా తిట్టుకుని వుంటావ్‌''
''ఒప్పుకుంటున్నాను కదా! కానీ ఆ రోజు మనం అంత వివరంగా చర్చించుకోక పోయివుంటే ఆ తర్వాత చాలా గొడవలయ్యేవి. ముఖ్యంగా మా అమ్మతో. సరేగానీ రెండేళ్ళయ్యాక కదా! పిల్లల్ని కనేద్దామా?''
''ఇంక అడ్డేముంది. నా ప్రాజెక్ట్‌ పూర్తయిందిగా. వి. విల్‌ ప్లానిట్‌''.
''మల్లె మొగ్గలు ఆకాశంలోంచి రాలుతున్నట్లు మంచు ఎలా కురుస్తోందో చూడు. ఇంత చలిలో కూడా నువ్వింత వెచ్చగా వున్నావేంటోయ్‌''
''రగ్గులు పెట్టమంటే, బయలు దేరేటపుడు అదేగా అన్నావ్‌. నువ్వుంటే చలేంటని. మర్చిపోయావా బుద్ధూ!! మీ నాన్నకి నువ్వు వంట చేస్తే ఎందుకంత బాధ. నేను నిన్ను కొంగుకి కట్టేసుకున్నానని మా మావయ్యతో అన్నాడంట''.
''నిజమే కదా! నన్ను కొంగుకు కట్టుకున్నావో కొప్పులో ముడేసుకున్నావో నీకు తెలియదా''.
''అంటే....''
''ఛ.... ఊరికే.... సరదాకి అన్నా. నువ్వు ఎవరికీ లొంగవని. ఎవరిని లొంగదీసుకోవని పాపం! ఆయనకు తెలియదు కదా! సంసారమంటే సహజీవన మని, ఇద్దరూ అన్నింటిని సమంగా పంచుకోవడమని ఆయన అర్థం చేసుకోవ డానికి చాలా సమయం పడుతుందిలే''
''నిన్ను నా ఫ్లాట్‌కి రమ్మన్నానని మా అమ్మ నన్నెంత తిట్టిందో తెలుసుగా. అదేంటే. అల్లుడు గారింటికి నువ్వెళ్ళాలి. ఎంత సంపాదిస్తే మాత్రం ఇలాగా ప్రవర్తించేది అంటూ చివాట్లేసింది''.
''మనం వాళ్ళని తప్పు పట్టలేం. వాళ్ళు బతికిన పరిస్థితుల్లోంచి వాళ్ళు మాట్లాడతారు. మారాల్సింది మనమే. మన పరిస్థితులు వేరు. వాళ్లు బతికిన తీరు లేరు''.
''గురూ! నీ ఆలోచనల్లోని స్పష్టత చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్‌. మనం మన ఫ్రెండ్సందరినీ చూస్తున్నాం. వాళ్ళ సంసా రాలు ఎలా వున్నాయో చూస్తున్నాం. చిన్న చిన్న విషయాల్లో సైతం సర్దుకోలేక ఎలా గొడవలు పడుతున్నారో మనకు తెలుసు. నీ ఫ్రెండ్‌ రమణ ఏంటి అలా తయారయ్యాడు''.
''రమణొక్కడే కాదు. మా చుట్టాల్లో చాలా మందిని చూస్తున్నాను. మా మేనత్తని మా మావయ్య ఎంత ఘోరంగా హింసిస్తాడో నాకు తెలుసు. అయితే ఓ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా వుంటూ, సంపాదిస్తూ కూడా ఆవిడ ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కాదు''.
''అదే నాకూ అర్థం కాదు. అంత ఆత్మగౌరవం లేకుండా ఎలా బతుకుతారా అన్పిస్తుంది. నా ఫ్రెండ్‌ అనిత తెలుసు కదా! ఒక హెల్ప్‌లైన్‌లో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. వాళ్ళ హెల్ప్‌లైన్‌కి ఎలాంటి కేసులు వస్తాయో, ఈ జనరేషన్‌ వాళ్ళు ఎంత అసహనంతో ప్రవర్తిస్తారో కథలు కథలుగా చెబుతుంటుంది''
''అవునా. మా రమణగాడి వైఫ్‌కి ఆ హెల్ప్‌లైన్‌ నెంబరు ఇస్తే సరిపోతుందిగా. వాడి తిక్కకుదర్చాల్సిందే''
''ఇచ్చానోయ్‌! అనితతో మాట్లాడింది కూడా. అనిత ఎపుడూ ఓ మాటంటుంది. ఈ కాలం మగవాళ్ళకి పెళ్ళాం అందంగా వుండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి మోడరన్‌గా కనబడాలి అదే సమయంలో వాళ్ళ అమ్మలాగా, అమ్మమ్మలాగా ఒదిగి, అణిగి చాకిరీ చేస్తూండాలి. అబ్బాయిలు సర్వసాధార ణంగా ఇలాగే ఆలోచిస్తారు అంటుంది''.
''అనిత అన్న దాంట్లో అతిశయోక్తి ఏంలేదు. నాకు తెలుసుగా నా ఫ్రెెండ్స్‌ సర్కిల్‌ ఆలోచనలెలా వుంటాయో! రిడిక్యు లస్‌. బహుశ నీ పరిచయం లేకపోతే నేనూ అంతే సంకుచితంగా ఆలోచించే వాడినేమో! నిజానికి నీ సాహచర్యంలో నేను చాలా సంస్కారాన్ని సంపాదించుకున్నాను. ఈ దేశంలోని మగవాళ్ళకు వాళ్ళ తండ్రుల ఆస్తితో పాటు అహంకారం కూడా వారసత్వంగా సంక్రమిస్తుంది. నాకలాంటి వారసత్వం వొద్దు అవనీ!''
''అందుకే గురూ! నీ మీద నాకు ఎనలేని ప్రేమ. నీ సంస్కారం, నీ ఆలోచన ల్లోని విశాలత్వం నాకెంతో ఇష్టం''
''అవనీ! నువ్వెపుడూ అంటూంటావే ఓ వాక్యం. అదంటే నాకు చాలా ఇష్టం. ప్రేమలో స్నేహం వుండాలి అంటే నాకు అర్థం కాలేదు మొదట్లో. అవును. ప్రేమలో ఇరుకు వుండకూడదు. స్నేహం వుండి తీరాలి. నేను అహంకారంతో ప్రవర్తించి, నిన్ను కట్టడి చేసి, హింసిస్తే నీ దృష్టిలో నేను అథఃపాతాళానికి జారిపోతాను. అపుడు మన మధ్య ప్రేమేంటి నా ముఖం''
''ఈ విషయాన్ని మగవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేరో కదా! పెళ్ళయిన క్షణం నుండి పెళ్ళాన్ని అదుపు ఆజ్ఞల్లో పెట్టాలనే ఆలోచన స్థానంలో ఇద్దరం ప్రేమగా, స్నేహంగా అన్నీ పంచుకుందాం, పెళ్ళినాడు చేసిన ప్రమాణాలు అవేకదా అని ఎందుకనుకోరు?''
''వాళ్ళకు నీలాంటి పెళ్ళాం లేదుగా'' నవ్వాడు గురు.
''అది సరేగాని నాకో ఐడియా వుంది చెప్పమంటావా''
''చెప్పవోయ్‌''
''మన ఫ్రెండ్స్‌లో చాలా మంది పెళ్ళిళ్ళాయ్యాక చాలా ప్రాబ్లమ్స్‌ ఎదుర్కొంటు న్నారు కదా. అందరూ బాగా చదువుకుని సంపాదిస్తున్న వాళ్ళే. డబ్బుకి కొదవలేదు. కొరవడింది మనశ్శాంతి''.
''నిజమే కానీ మనమేం చెయ్యగలం?''
''చాలా చెయ్యొచ్చు. మనింటి తలుపులు అందరికోసం బార్లా తెరిచేద్దాం. పూనాలో ఓ జంట గురించి చదివినపుడు నాకు చాలా ముచ్చటేసింది. వాళ్ళు మనలాగే ఓ ఆదర్శవంతమైన జీవితాన్ని సాధించు కున్నారు. సమస్యల్లో వున్న వాళ్ళెవరైనా వాళ్ళింటికెళ్ళిపోవచ్చు. వాళ్ళతో కలిసి వుండొచ్చు. తమ కష్టాలను, సమస్యల్ని పంచుకోవచ్చు. ఇంకో అద్భుతమైన విషయమేమిటంటే వాళ్ళు వాళ్ళింటి తాళం బయట గూట్లోనే వదిలేసి వెళ్ళిపోతారట.
ఎవరైనా ఫోన్‌ చేసి మీ యింట ికొస్తున్నామంటే, తాళం ఫలానా చోట వుంది తీసుకుని లోపలికెళ్ళండి. మేం సాయంత్రమో, రేపో వస్తామని చెబుతారట. గురూ! నాకు కూడా అలాంటిది ప్లాన్‌ చెయ్యాలని వుంది. మనం ఎంత హాయిగా వున్నామో, దాన్ని ఎలా సాధించుకున్నామో ప్రత్యక్షంగా చూపిద్దామోయ్‌''
అవని వేపు అలాగే చూస్తుండి పోయాడు గురు. స్వచ్ఛంగా మెరుస్తున్న కళ్ళమీద ముద్దు పెట్టి
''వండర్‌ఫుల్‌ ఐడియా! యు ఆర్‌ సో డిఫరెంట్‌. ఐ లవ్‌ యూ'' అంటూ అవనిని ఉక్కిరి బిక్కిరి చేసాడు.
''మనం ఒకసారి పూనా వెళ్ళొచ్చి వాళ్ళతో మాట్లాడాక వచ్చే న్యూ యియర్‌ నుంచే మన ప్రాజెక్ట్‌ మొదలు పెట్టేద్దాం''.
''మన సంతోషాన్ని అందరికీ పంచుతానంటే నేనొద్దంటానా''
''దీనికి ఓ మంచి పేరు పెట్టాలి ఏమని పెడదాం''
''పేరా? ఉండు. నాకేదో గొప్ప ఆలోచన వచ్చేస్తోంది. నీ ఫేవరేట్‌ వాక్యం. ప్రేమంటే స్నేహం. స్నేహముంటేనే ప్రేమ వికసిస్తుంది. ఎలా వుంది?''
''బావుంది. ఇంకొంచం ఆలోచించ వోయ్‌ గురుదేవా?''
''ఉండు శిష్యా. కాస్త ఆలోచించు కోనీ''
''సరే ఆ విషయం ఆలోచిద్దాం లే గురూ! నాకు నిజంగా ఈ రోజు ఎంతో సంతోషంగా వుంది''.
''అవనీ. నాకు సంతోషంగా... చాలా సంతోషంగా వుంది. మొగుడూ పెళ్ళాలు స్నేహంగా వుంటే, అన్నీ పంచుకుంటే ఎంత బావుంటుందో అర్థమౌతోంది. సహజీవనం అంటే ఇలాగే వుండాలి అని చాలా బలంగా అందరికీ చెప్పాలన్పిస్తోంది''.
''మనం ఆ పనేగా చెయ్యబోతున్నాం. మంచులోకి వెళదామా గురూ''
''సరంజామా అంతా వుందిగా. పద పోదాం''
కోట్లూ, బూట్లూ తగిలించుకుని జోరుగా కురుస్తున్న మంచులోకి నడిచారిద్దరూ. మంచుపూల వానలో తడుస్తూ, స్వచ్ఛమైన ఆలోచనల్ని, సంస్కార వంతమైన ఆచరణని స్వప్నిస్తూ వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఇంకొకరు చెయ్యేసి అలా మంచుమీద నడుస్తూ ముందుకెళ్ళసాగారు. ప్రేమలో స్నేహాన్ని సాధించిన వాళ్ళిద్దరూ రేపటితరం ఆకాంక్షల్లా అన్పిస్తున్నా